ఓటు హక్కుపై మైదుకూరులో ర్యాలీ
కడప,జనవరి25(జనంసాక్షి): ఓటు హక్కును ప్రతి ఒక్కరూ గుర్తించాలని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. మైదుకూరు పట్టణంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల తహశీల్దారు ఎ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ రోజు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం, ర్యాలీ జరిగింది. మండల తహశీల్దారు కార్యాలయం నుంచి మైదుకూరు పట్టణంలో రహదారులపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది వంటిదని మండల తహసీల్దారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని ఓటు హక్కును తప్పక వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మైదుకూరు మేధా విద్యార్థులు ఓటుహక్కుపై నిర్వహించిన నాటకం చూపరులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో మండల తహశీల్దారు ఏ నాగేశ్వరరావుతో పాటు సిఐ వెంకటేశ్వర్లు రెవెన్యూ సిబ్బంది. బిజెపి జాతీయ కౌన్సిల్ హౌస్ సభ్యులు బిపి ప్రతాప్ పలు పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో యువత విద్యార్థులు పాల్గన్నారు.