కంచె ఐలయ్య గృహనిర్బంధం
టిమాస్ సబ్యుల ర్యాలీ…పలువురు అరెస్ట్
ప్రభుత్వాల అప్రజాస్వామిక పాలనపై పోరాటం
నిర్బంధంపై కంచె ఐలయ్య
ఐలయ్య బేషరతు క్షమాపణలు చెప్పాల్సిందే అన్న వైశ్య,బ్రాహ్మణ సమాఖ్య
హైదరాబాద్/విజయవాడ,అక్టోబర్28(జనంసాక్షి): కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పాలన చేస్తున్నాయని, ముఖ్యంగా ప్రధాని మోడీ తీరు దారుణమని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. అణచివేత విదానాలతో ప్రజలను నిర్బంధాలకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ విధానాలపై పోరాటాలు
చేయాల్సి ఉందన్నారు. సికింద్రాబాద్ తార్నాకలో కంచ ఐలయ్యను ఆయన నివాసంలో పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గృహ నిర్బంధంలో ఉన్న ఆయన బయటకు వస్తే అరెస్టు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు టీమాస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. గృహనిర్బంధం నుంచి ఐలయ్యను విడుదల చేయాలని డిమాండ్ చేసారు. దీంతో
తార్నాకలోని కంచె ఐలయ్య నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజయవాడలో నిర్వహించ తలపెట్టిన సభకు ఏపీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో టీమాస్ నేతలు, వివిధ కుల సంఘాల నేతలు ఐలయ్య నివాసం వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. గృహ నిర్బంధం చేసిన ఐలయ్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపటి తర్వాత టీమాస్ నేతలు ర్యాలీ నిర్వహించి చలో విజయవాడ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపైకి రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీమాస్ నేతలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నాయని టీమాస్ నేతలు విమర్శించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. విజయవాడలో జరిగే సభను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. టీమాస్ నేతలతో సమావేశం అయిన తర్వాత విజయవాడలో జరిగే సభకు తాను హాజరుకావాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. విజయవాడలో దళిత సంఘాల ఆత్మీయ సన్మాన సభకు అనుమతివ్వాలన్నారు ప్రొఫెసర్ కంచె ఐలయ్య. ఇప్పటికే విూటింగ్ నిర్వహణపై ఆర్యవైశ్య సంఘాల నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయ న్నారు. చట్టాన్ని గౌరవిస్తామని చెప్పిన కంచె ఐల్లయ్య.. పోలీసుల అనుమతితోనే విూటింగ్ కు వెళ్తానని చెప్పారు. మరోవైపు టీమాస్, ఆర్యవైశ్య సంఘాల పోటీపోటీ సభలతో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కంచ ఐల్లయ్య ఈ సభకు వస్తారన్న సమాచారంతో.. ఆర్యవైశ్య సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. దీంతో విజయవాడలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. ఎలాంటి సభలు, ర్యాలీలకు అనుమతి లేదని ఏపీ పోలీసులు చెబుతున్నారు. అయితే మరో వైపు ఎలాగైన విూటింగ్ తో పాటు ర్యాలీలు నిర్వహించేందుకు ఇరు సంఘాలకు చెందిన నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలావుంటే దళిత సంఘాలతో చర్చలను ఆర్యవైశ్య, బ్రాహ్మణ సంఘాలు కొట్టిపారేశాయి. ఆర్యవైశ్య, బ్రాహ్మణ సంఘాలకు కంచ ఐలయ్య బహిరంగ క్షమాపణ చెప్పాలని, క్షమాపణ చెప్పిన తర్వాతే చర్చలు జరుపుతామని ఆర్యవైశ్య, బ్రాహ్మణ సంఘాల నేతలు పేర్కొన్నారు. దీంతో విజయవాడలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా… ఆర్యవైశ్య, బ్రాహ్మణ సంఘాలతో సయోధ్య కుదిరిందని తొలుత శనివారం ఉదయం కంచ ఐలయ్య మద్దతుదారులు ప్రకటించారు. అంతేగాక మధ్యాహ్నం సంయుక్తంగా విూడియా సమావేశం కూడా నిర్వహిస్తామని, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు కూడా వేస్తామని పేర్కొనడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే… ముందుగా ఐలయ్య ఆర్యవైశ్య, బ్రాహ్మణ సంఘాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాతే చర్చలు అంటూ ఆర్యవైశ్య, బ్రాహ్మణ సంఘాల నేతలు పేర్కొనడంతో మళ్లీ పరిస్థితి మొదటికొచ్చిన్లటైంది. అంతేగాక ఐలయ్య వర్గీయులు సభ నిర్వహిస్తే మేం కూడా నిర్వహిస్తామంటూ పేర్కొన్నారు. మరోవైపు కంచ ఐలయ్య విజయవాడ వస్తే అరెస్టు చేస్తామని డీజీపీ సాంబశివరావు తెలిపారు. ఆయన విూడియాతో మాట్లాడుతూ… విజయవాడలో తలపెట్టిన సభలకు అనుమతి లేదన్నారు. అలాగే కులాలు, మతాల పేరిట సభలు, ఆందోళనలకు అనుమతి ఇవ్వలేమని, విజయవాడలో
144 సెక్షన్ అమలులో ఉందని డీజీపీ తెలిపారు. కాగా… శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా అరెస్ట్ చేస్తామని, తుని సంఘటనను దృష్టిలో పెట్టుకుని అనుమతి ఇవ్వడం లేదని డీజీపీ తెలిపారు.