కట్నం కోసం వేధించినభర్త, అత్త, మామకు జైలు

గుంటూరు(లీగల్‌): అదనపు కట్నం కోసం వేధించిన భర్తకు రెండేళ్ల జైలు, రూ.20వేల జరిమానా, అత్తమామలకు ఆరునెలల జైలు, రూ.10వేల చొప్పున జరిమానా విధిస్తూ, గుంటూరు నాలుగవ అదనపు మున్సిఫ్‌ మేజిస్ర్టేట్‌ కే ప్రత్యూష కుమారి మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం హైదరాబాద్‌ మోతీనగర్‌కు చెందిన కోటు వెంకట శివరామ్‌ ప్రసాద్‌కు, గుంటూరు అడపావారి వీధికి చెందిన జాగు ఆదినారాయణ కుమార్తె యామినీ శివంతినికి 2009 మార్చి 5న వివాహమైంది. పెళ్ళి సమయంలో ఆదినారాయణ రూ. 6 లక్షల నగదు, 210 గ్రాముల బంగారం కట్నం కింద ఇచ్చాడు. శివంతిని హైదరాబాద్‌లో ఇక్ఫాయ్‌ యూనివర్సిటీలో ఉద్యోగం చేసేది. వెంకట శివరామ్‌ ప్రసాద్‌ బెంగుళూరులో ఐబీఎం కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే మరో రూ. 20 లక్షలు డబ్బు, ఒక ప్లాటు కొనివ్వాలని భార్యను వేధించడం ప్రారంభించాడు. రాను రాను వేధింపులు పెంచారు. డబ్బు తెస్తేనే ఇంట్లోకి రానిస్తామని ఆమెను గెంటివేశారు. మధ్యవర్తుల రాజీ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో శివంతిని గుంటూరు కోర్టులో భర్త, అత్తమామలు, మరిది రాజశేఖర్‌, మరదలు రాజేశ్వరిపై ఫిర్యాదు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు లాలాపేట పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ఉమెన్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ సీహెచ్‌ సీతారామయ్య కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఏపీపీ స్వర్ణలతా భాను ప్రాసిక్యూషన్‌ నిర్వహించారు. విచారణలో భర్త వెంకట శివరామ్‌ ప్రసాద్‌, అత్తమామలు ల క్ష్మీకుమారి, మధుసూధనరావులపై నేరం రుజువైంది. భర్త కోటు వెంకట శివరామ్‌ ప్రసాద్‌కు రెండేళ్ల జైలు శిక్ష, రూ. 20వేల జరిమానా, అత్తమామలు లక్ష్మీకుమారి, మధుసూధనరావులకు 6 నెలల జైలు, రూ 10వేల చొప్పున జరిమానా విధించారు. మరిది రాజశేఖర్‌, మరదలు రాజేశ్వరీపై కేసును కొట్టి వేస్తూ మేజిస్ర్టేట్‌ తీర్పు చెప్పారు.

తాజావార్తలు