కన్నాకు బిజెపి అధ్యక్షపదవిపై పార్టీలో చిచ్చు
రాజీనామా చేసిన తూర్పు అధ్యక్షుడు
అదేబాటలో మరికొందరు
రాజమహేంద్రవరం,మే14(జనం సాక్షి): బిజెపిలో అంతర్గత చిచ్చు మొదలయ్యింది. కన్నా లక్ష్మీనారాయణ ఎంపిక ఆ పార్టీలో తీవ్ర అలజడి రేపింది. ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను ఎంపిక చేసిన మరుసటి రోజే ఆ పార్టీలో ముసలం ప్రారంభమైంది. ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు అధ్యక్ష పదవి ఇవ్వనందుకు అసంతృప్తిగా ఉన్న ఆయన వర్గీయులు పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా భాజపా అధ్యక్షుడు మాలకొండయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు పంపినట్లు మాల కొండయ్య వెల్లడించారు. ఇకపై తాను సాధారణ కార్యకర్తగా మాత్రమే పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఆయనతో పాటు రాజమహేంద్రవరం నగర భాజపా అద్యక్షులు బొమ్ముల దత్తు, పాటు ఇతర సభ్యులంతా పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. సుధీర్ఘ కాలంగా పార్టీకి సేవ చేస్తున్న సోమువీర్రాజును కాదని.. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై తాము ఆవేదనతో ఉన్నామని నేతలు తెలిపారు. సోము వీర్రాజుకు అవకాశం ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ ఉభయ గోదావరి జిల్లాల్లో కొందరు నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. పార్టీలో మొదటి నుంచి ఉంటున్న వారిని కాదని… కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి పదవి కట్టబెట్టడాన్ని వారు తప్పుబడుతున్నారు. అయితే ఇలాంటి వాటికి కేంద్ర నాయకత్వం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఏపీలో స్వతహాగా బలపడాలని ఆ పార్టీ యోచిస్తోంది. రాష్ట్రంలో పెద్దగా బలం లేకపోయినా కేంద్రంతో పాటు దేశంలోని అత్యధిక రాష్టాల్లో అధికారంలో ఉంది. ఆర్‌ఎస్‌ఎస్ హిందూత్వ పునాదులపైనే ఆ పార్టీ ఆధారపడి నడుస్తుంటుంది. పార్టీలో ముఖ్య పదవులకు సైతం వీటి ప్రాతిపదికగానే ఎంపిక జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ భాజపా సారథిగా కన్నా లక్ష్మినారాయణకు అవకాశం ఇవ్వటం ఆ పార్టీ నేతల్ని ఒకింత ఆశ్ఛర్యానికి గురిచేసింది. హరిబాబు రాజీనామా తర్వాత అధ్యక్ష ఎంపికపై చర్చ సమయంలో కన్నా పేరు ప్రతిపాదనకు వచ్చినా…. ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చారు కాబట్టి ఇవ్వరనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ అనూహ్యంగా ఆయన పేరునే అధిష్టానం ఖరారు చేసింది. ఇది సంప్రదాయ భాజపా వాదుల్లో అసంతృప్తికి కారణమైంది. ముఖ్యంగా పార్టీ అధ్యక్ష పదవిపై గంపెడాశలు పెట్టుకున్న సోము వీర్రాజుకు తీవ్ర నిరాశ కలిగించింది. సోము వీర్రాజుకు ఎన్నికల నిర్వహణ కమిటి కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. అసంతృప్తికి లోనైన సోము అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన ఫోన్ స్విచాఫ్ చేశారు. గోదావరి జిల్లాలకు చెందిన నేతలు సోముకు అధ్యక్ష పదవి ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. అదీగాక కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో ఆయన్ని ఆపి పదవి ఇవ్వటమేంటని ప్రశ్నిస్తున్నారు. భాజపా మూల సిద్దాంతాలతో సంబంధం లేని వ్యక్తి పార్టీ నుంచి వెళ్లిపోతుంటే పట్టుబట్టి ఆపడం… ఇపుడు రాష్ట్ర అధ్యక్షునిగా నియమించటం ఏమిటనే ప్రశ్నలు వారి నుంచి వస్తున్నాయి.
———