కర్నాటక సిఐడి అదుపులో అగ్రిగోల్డ్ ఛైర్మన్
ఏలూరు,మార్చి31(జనంసాక్షి): సంచలనం కలిగించిన అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా కర్ణాటక సీఐడీ పోలీసులు పశ్చిమగోదావరి జిల్లాకు విచ్చేశారు. ఏలూరులోని సబ్‌జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకటరామారావు, ఎండీ శేషునారాయణతో పాటు కేసుకు సంబంధించి అగ్రిగోల్డ్ సంస్థ ఉపాధ్యక్షుడు సమ్మిది సదాశివవరప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ కామిరెడ్డి శ్రీరామచంద్రరావు, డైరెక్టర్ పటాన్‌లాల్ అహ్మద్ ఖాన్‌లను అదుపులోకి తీసుకుని బెంగళూరు తరలించారు. కర్నాటకలో కూడా అగ్రిగోల్డ్ పెద్ద ఎత్తున నిధులు సేకరించింది. అక్కడా పలు కేసులు నమోదయ్యాయి. దీంతో వారిని విచారించేందుకు తీసుకుని వెళ్లారు. ఇదిలావుంటే అగ్రిగోల్డ్ సంస్థ మోసాలపై ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోందని బిజెపి పక్షనేత విష్ణుకుమార్ రాజు విమర్శించారు..కావాలనే దర్యాప్తు జరక్కుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు..విచారణ జరపడంలో సిఐడి వైఫల్యం చెందిందని వ్యాఖ్యానించారు..అలాగే అసెంబ్లీలోనూ బిజెపికి తగిన సమయం కేటాయించలేదని ఆరోపించారు..అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేవరకు పోరాడతామని ప్రకటించారు..ప్రభుత్వంలో భాగస్వాములైనప్పటికీ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు, అవసరమైతే అసెంబ్లీ ముందు అయినా ధర్నాకు దిగుతామని వ్యాఖ్యానించారు..