కాకినాడలోని విద్యార్థుల తిరుగుబాటు
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని నారాయణ ఐఐటీ క్యాంపస్‌లో భోజనం సరిగా లేదంటూ విద్యార్థులు మంగళవారం రాత్రి తిరుగుబాటు చేశారు. భోజనం, సౌకర్యాలు సరిగా లేవంటూ హాస్టల్ విద్యార్థులు విధ్వంసం సృష్టించారు. భవనం కిటికీల అద్దాలు పగులగొట్టారు. తరగతి గదులతోపాటు ఇతర ప్రాంతాల్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. హాస్టల్‌లో దాదాపు 500 మంది విద్యార్థులు ఉంటున్నట్లు సమాచారం. తమ విద్యార్థుల మధ్య చిన్న వివాదం చోటు చేసుకుందని, ఎవరూ కలుగజేసుకోవద్దని యాజమాన్య ప్రతినిధులు పేర్కొనడంతో.. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు సైతం బయటే గంటల తరబడి నిలబడాల్సి వచ్చింది. తమ తల్లిదండ్రులు రూ.వేలకువేలు ఫీజులు చెల్లిస్తున్నా యాజమాన్యం మాత్రం తమకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందంటూ విద్యార్థులు ఆగ్రహంతో పెద్దగా కేకలు వేశారు.
విషయం తెలుసుకున్న మీడియా అక్కడకు చేరుకోవడాన్ని గమనించిన యాజమాన్య ప్రతినిధులు విద్యార్థుల నోరు నొక్కేందుకు విఫలయత్నం చేశారు. టూ టౌన్ ఎస్సైలు కె.పార్థసారథి, నాగరాజు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని యాజమాన్య ప్రతినిధులతో చర్చించారు. ఫిర్యాదు అందకపోవడంతో వారు కూడా వెనుదిరిగారు. ఈ ఘటనతో నారాయణ ఐఐటీ క్యాంపస్‌లో మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 10.30 గంటల వరకు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.