కాపులకు రిజర్వేషన్లు కావాలని ఎవరూ కోరలేదు
వారి స్థితిగతులను చూసి తానే హావిూఇచ్చా
మంజునాత కమిషన్‌తో అధ్యయనం చేయించా
అసెంబ్లీలో సిఎం చంద్రబాబు ప్రకటన
ఇతర బిసిలకు అన్యాయం జరగదన్న మంత్రి అచ్చన్న
అమరావతి,డిసెంబర్2(జనంసాక్షి): కాపుల రిజర్వేషన్ బిల్లు – 2017కు ఆంధప్రదేశ్ అసెంబ్లీ శనివారం ఆమోదం తెలిపింది. కాపు రిజర్వేషన్ బిల్లును మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టగా పలువురు సభ్యులు ఈ బిల్లుపై చర్చించారు. అనంతరం కాపు రిజర్వేషన్ బిల్లుకు సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈసందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో కాపులకు రిజర్వేషన్లు ఉండేవని చెప్పారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కారణాలు చెప్పకుండా రిజర్వేషన్లు తీసేశారన్నారు. 2016లో కాపుల రిజర్వేషన్‌పై మంజునాథ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలోని జిల్లాలన్నింటిలో పర్యటించిన కమిషన్ సభ్యులు కాపుల స్థితిగతులను అధ్యయనం చేసినట్లు చెప్పారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని తనను ఎవరనూ అడగలేదని బాబు అన్నారు. పాదయాత్ర చేసిన సమయంలో కాపుల కష్టాలను చూసి.. తానే రిజర్వేషన్ ఇవ్వాలని భావించినట్లు చెప్పారు. మంజునాథ కమిషన్ కాపుల రిజర్వేషన్‌పై నివేదిక అందజేసినట్లు వెల్లడించారు. కాపులు రాజకీయ రిజర్వేషన్లను కోరుకోవడం లేదని అందుకే సామాజిక, ఆర్థిక, ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్‌ను కల్పిస్తున్నట్లు వివరించారు. కాపులకు రిజర్వేషన్ల ఇవ్వడం వల్ల వెనుకబడిన తరగతులకు ఎలాంటి అన్యాయం జరగబోదని చెప్పారు. బీసీలకు అన్యాయం జరగకుండా చూస్తామని అన్నారు. కాపుల(కాపు, తెలగ, బలిజ, ఒంటరి)ను బీసీ(ఎఫ్) కేటగిరీలో చేరుస్తున్నట్లు తెలిపారు. కాపుల రిజర్వేషన్లను షెడ్యూల్ 9లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు చెప్పారు. బీసీ(ఎఫ్) కేటగిరీలోని వారందరికీ 5 శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని వివరించారు. కాపులకు బీసీ ఎఫ్ కేటగిరీగా 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఈ బిల్లును తీసుకువచ్చారు. కాపులకు రాజకీయంగా రిజర్వేషన్లు ఇవ్వడం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు.. రాజకీయంగా రిజర్వేషన్లు ఇవ్వడం లేదు.. కేవలం విద్య, ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లని సీఎం తేల్చిచెప్పారు. రిజర్వేషన్లు 50 శాతం దాటితే కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని, త్వరలో కేంద్రానికి ఈ బిల్లు పంపిస్తామన్నారు. కాపు రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదిద్దామన్నారు. బిల్లును కేంద్రం ఆమోదించే వరకు కేంద్రంపై ఒత్తిడి తెద్దామని అసెంబ్లీలో చంద్రబాబు చెప్పారు. బీసీలకు ఎలాంటి నష్టం జరగదని సీఎం ఈ సందర్బంగా హావిూ ఇచ్చారు. తొలిసారిగా కాపుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్లు కేటాయించామన్న విషయాన్నిసీఎం గుర్తు చేశారు. అగ్రవర్ణాల్లోని పేదలందరికీ న్యాయం చేస్తామన్నారు. అగ్రవర్ణాల్లోని పేదల అభివృద్ధికి బ్జడెట్‌లో నిధులు కేటాయించాం.. పేదరికంలేని సమాజ స్థాపనే తన లక్ష్యమని చంద్రబాబు చెప్పుకొచ్చారు.అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి సభలో నేరుగా ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అనంతరం కాపులకు రిజర్వేషన్ బిల్లుపై సభలో జరిగిన చర్చలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అంటే సామాజిక న్యాయమని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. అన్ని వర్గాలు సమానంగా అభివృద్ధి చెందాలనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు. 2014 ఎన్నికల ప్రణాళికలో కాపుల రిజర్వేషన్లను పొందుపరిచామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూలన్నీ అమలు చేస్తున్న ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. గతంలో ఉన్న నేతలు కాపులను
బీసీల్లో చేర్చకుండా చంద్రబాబుపై విమర్శలు చేశారన్నారు. రిజర్వేషన్లను కొందరు రాజకీయం చేయడానికే వాడుకున్నారని ఆరోపించారు. అనంతరం తెదేపా ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుని బీసీల్లో కాపులను చేర్చే అంశంపై లోతుగా కసరత్తు చేశామని చెప్పారు. బీసీ కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభిప్రాయాలు సేకరించినట్లు వెల్లడించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం కాపుల కోసం పది రూపాయాలు కూడా వెచ్చించలేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశానికి ముందు సీఎం చంద్రబాబును కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రెండు దశాబ్దాల్లో కాపులకు ఎవరూ చేయనిది తాము చేసి చూపిస్తున్నామని ఆయన అన్నారు.