కాపు రిజర్వేషన్ల పై కొనసాగుతున్న ఉద్రిక్తత….
విజయవాడ : నిన్నంతా అట్టుడికిన తుని నేటికి చల్లబడింది. కాని అసలు వ్యవహారం మాత్రం వేడి మీదే ఉంది. కాపు రిజర్వేషన్ల సమస్య నివురు గప్పిన నిప్పులా రగులుతూనే ఉంది. నేటి సాయంత్రం వరకు ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించిన ముద్రగడ పద్మనాభం.. 3 గంటలకు మీడియా సమావేశంలో కార్యాచరణ ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం దీనిపై తర్జనభర్జనలు పడుతోంది. విజయవాడలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు, ముఖ్యనేతలతో భేటీకానున్న బాబు..దీనిపై చర్చించనున్నారు. సర్దార్ షూటింగ్‌కు బ్రేకిచ్చి హైదరాబాద్ చేరుకున్న పవన్ కాపు గర్జన ఘటనలపై 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. దీంతో అందరి చూపులు నేటి పరిణామాలపైనే ఉంది. సాయంత్రానికి కాపు రిజర్వేషన్ ఉద్యమం ఏ రూపం తీసుకుంటుందనేదానిపై ఉత్కంఠ రేగుతోంది.