కామాంధులను గ్రామాల నుంచి బహిష్కరించాలి

 దాచేపల్లి ఘటన బాధాకరమన్న నన్నపనేని
బాధితురాలికి యరపతనేని 2లక్షల సాయం
శబరి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసిన ఆందోళనకారులు
గుంటూరు,మే3(జ‌నం సాక్షి): కామాంధులను గ్రామాల నుంచి బహిష్కరించాలని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి పిలుపునిచ్చారు. దాచేపల్లి ఘటన బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని, బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని రాజకుమారి భరోసా ఇచ్చారు. దాచేపల్లిలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ 50 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది. ఈ ఘటనపై రాత్రి నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన వెలుగుచూసిన వెంటనే స్థానికులు భగ్గుమన్నారు. అర్థరాత్రి రోడ్లపైకి వచ్చి రాస్తారోకో చేశారు. దీంతో అద్దంకి, నాచేపల్లి రహదారిపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వేలాది వాహనాలు బారులు తీరాయి. దాచేపల్లి ఘటన బాధితురాలిని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పరామర్శించారు. బాలిక భవిష్యత్తు కోసం వ్యక్తిగతంగా రూ.2లక్షల ఆర్థిక సాయం చేశారు. బాధితురాలికి ప్రభుత్వ సాయం అందేలా చూస్తామని, అత్యాచార ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని ఆయన చెప్పారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీస్‌ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి మానవ మృగాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై యాభైఏళ్ల వ్యక్తి  అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన బాధితురాలి కుటుంబీకులు, గ్రామస్తులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. జిల్లాలోని నడికుడి
జంక్షన్‌లో ఆందోళన కొనసాగుతోంది. రైల్వేస్టేషన్‌లోకి వెళ్లిన ఆందోళనకారులు శబరి ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకున్నారు. ట్రైన్‌ నిలిపివేసి పట్టాలపై ఆందోళనకారులు నిరసన చేపట్టారు. దీంతో నార్కట్‌పల్లి, అద్దంకి హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి.  మరోవైపు దాచేపల్లి పీఎస్‌ ఎదుట టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాస్తారోకో, ధర్నాలు, బంద్‌ పిలుపుతో దాచేపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. తెరిచి ఉంచిన షాపులపై ఆందోళనకారులు దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో వీధుల్లో ఆందోళనకారులు తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే పరారీలో ఉన్న సుబ్బయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు.

తాజావార్తలు