కార్తీకం మాసంతో శివాలయాలకు పోటెత్తిన భక్తులు

నదీ,సముద్ర తీరాల్లో పుణ్యస్నానాలు

ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాల నిర్వహణ

అమరావతి,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): కార్తీక మాస ప్రారంభం కావడంతో తెలుగు రాష్టాల్ల్రో పుణ్యక్షేత్రాలు శివ నామస్మరణతోమార్మోగుతున్నాయి. దీపావళి మరుసటి రోజు కార్తీక మాసం ప్రారంభం కావడం అందునా తొలిరోజే శుక్రవారం రావడంతో మహిళా భక్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దీంతో దీపావళి సంబరాల్లో పాల్గొన్న ప్రజలు తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాలకు పోటెత్తారు. గోదావరి తీరంలో ఉన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయాన్ని పుణ్యస్నానాలు ఆచరించి శివుడికి అభిషేకాలు నిర్వహించారు. దీనికితోడు సముద్ర, నదీతీరాల్లో భక్తుల కోలాహలం కనిపించింది. ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం, మహానంది, కోటప్పకొండ, విజయవాడ కనకదుర్గ, పంచారామాలు శివనామస్మరణతో మార్మోగాయి. శ్రీశైలం పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. పంచా రామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామంలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ పరమశివుడిని ప్రార్థిస్తున్నారు. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని శివాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. అమరావతి, కోటప్పకొండలకు భక్తులు పోటెత్తారు. విజయవాడలో కృష్ణాతీరంలో పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక మాస వేడుకల్లో భాగంగా కడప జిల్లాలో ప్రాచీన ఆలయాలైన

శ్రీఉమామహేశ్వరి, అప్పయ్యస్వామి ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆలయాల్లో రుద్రాభిషేకాలు, ఇతర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలైన బాసర,వేములవాడ రాజన్న ఆలయం, కాళేశ్రం, ధర్మపురి, వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి,రామప్ప ఆలయం, కొడవటూరు, కీసరలోని రామలింగేశ్వర ఆలయాలకు భక్తుల పోటెత్తారు. తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో తెలంగాణవ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసం తొలి శుక్రవారం సందర్భంగా భద్రాచలంలోని పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక మాసంలో జరిగే పుణ్యస్నానాలను పురస్కరించుకొని ఘాట్ల వద్ద అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. స్నానాలకు వచ్చిన భక్తులు ముందుగా గోదావరి మట్టిని తీసుకొని అమ్మవారిగా భావించి సహస్రనామాలు పఠించారు. తులసి పూజలు నిర్వహించారు. వాయనాలను ఇచ్చి పుచ్చుకున్నారు. గోదావరి మాతకు పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి స్నానాలు ఆచరించారు. చల్లంగ చూడాలని వేడుకుంటూ కరకట్ట వద్ద వున్న ఆంజనేయస్వామి వారిని, సుబ్రమణ్యస్వామి వారిని దర్శించి పూజలు చేశారు.

తాజావార్తలు