కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం -మేడే వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు

– కార్మిక చట్టాలను ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చాం
– సంపద సృష్టించకుండా పేదరిక నిర్మూలన సాధ్యంకాదు
– కార్మికులకు శ్రమకు తగ్గ ఫలితం అందేలా చూస్తాం
– విద్యుత్‌ చార్జీలు పెంచబోం
విజయవాడ, మే1(జ‌నం సాక్షి) : రెండున్నర కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారని, వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం జరిగిన మేడే వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మేడే సందర్భంగా ఆయన జోన్‌లవారీగా 69మంది కార్మికులకు శ్రమశక్తి అవార్డులు, 36మంది పారిశ్రామికవేత్తలకు ఉత్తమ యాజమాన్య అవార్డులను అందజేశారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. విద్యుత్‌ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని అన్నారు. భవిష్యత్‌లో కరెంట్‌ చార్జీలు పెంచబోమని…నాణ్యమైన కరెంట్‌ ఇస్తామని స్పష్టంచేశారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం చంద్రన్న బీమా తీసుకొచ్చామన్నారు. రూ. 250 కోట్లతో 2.13 కోట్ల మందికి బీమా సదుపాయం కల్పించామని తెలిపారు. బాధిత కుటుంబాలకు బీమా సొమ్ము త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్మిక చట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చామని సీఎం తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా త్వరగా పనులు అయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రిటైల్‌ ట్రేడ్‌ పాలసీని తీసుకొచ్చామన్న బాబు సంపద సృష్టించకుండా పేదరిక నిర్మూలన సాధ్యంకాదన్నారు. కార్మికుల శ్రమకు తగిన ఫలితం అందేలా చూస్తామని తెలిపారు. కేంద్రం ఏవిూ చేయలేదని రోడ్డెక్కి తమ బస్సులను తగులబెట్టుకుంటే నష్టం తప్ప ఏవిూ ఉండదని, కష్టపడుతూనే హక్కుల కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. శ్రమ సంస్కృతిని అందరూ గౌరవించాలని, కార్మికుల కోసం కార్పొరేట్‌ హౌసింగ్‌ విధానానికి యాజమాన్యాలు ముందుకు రావాలన్నారు. ఉపాధి అవకాశాలు లభిస్తే సమాజంలో అలజడి ఉండదని, పనిలేని వారే లేనిపోని సమస్యలు సృష్టిస్తారని చంద్రబాబు తెలిపారు.

తాజావార్తలు