కార్మిక హక్కుల కోసం పోరాటం: సిఐటియూ
ఏలూరు,ఆగస్ట్28: గతంలో కార్మిక లోకం పోరాటాలు సాగించి తమ హక్కులను సాధించుకున్నారని నేటి ప్రభుత్వాలు ఆ హక్కులను కాలరాస్తున్నాయని సీఐటీయూ నేతలు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ సంస్కరణల పేరుతో ప్రయివేటీకరణ విధానాలను వేగవంతం చేస్తున్నాయని చెప్పారు.కార్పోరేట్ సంస్థల ప్రయోజనాల కోసం విధానాలను మారుస్తున్నారని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పెరిగిపోయాయని వారికి ఉద్యోగ, ఆరోగ్య భద్రతలేకుండా చేస్తున్నారని ఆవేదన చెందారు. ప్రభుత్వం జీవో 279ను అమలు చేస్తే మున్సిపల్ కార్మికులు తీవ్రంగా నష్టపోతారని, తక్షణం దీనిని రద్దు చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. జీవో 279ను రద్దు చేయాలని, జీవో నెంబరు 151 ప్రకారం జీతాలు పెంచాలని డిమాండ్ చేసారు. కార్పొరేట్ సంస్థలకు స్థానిక సంస్థలను కట్టబెడుతున్నాయని తెలిపారు. మున్సిపల్ కార్మికులను బానిసలుగా మార్చి కోట్లాది రూపాయలు భారం మోపే జీవో నెంబరు 279 రద్దు చేయాలన్నారు. యంత్రాల కొనుగోలు, కాంట్రాక్టర్లకు కవిూషన్ల చెల్లింపుతో ప్రజలపై కోట్లాది రూపాయలు భారం పడే ప్రమాదం ఉందన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల జీతాలు పెంచుతూగత అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 151 జీవోను మున్సిపల్ కార్మికులకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. 279 జీవోతో కార్మికుల హక్కులను కోల్పోవాల్సి ఉంటుందన్నారు. రెండున్నర సంవత్సరాలుగా తమ పిఎఫ్‌ను తమ ఖాతాలలో జమ చేయ లేదన్నారు.