కాలుష్యంపై కఠిన చర్యలేవీ?
వాతావరణ మార్పులు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాలుష్యం మోతాదు మించి ఇటీవల ఢిల్లీ అతాకుతలం అయ్యింది. అమెరికాలో మంచు తుఫాన్లు కలవరం కలిగిస్తున్నాయి. చలిగాలుల తీవ్రత కారణంగా అనేక సమస్యలు వస్తున్నాయి. ఇలా విపరీత పరిణామాలు సంభవించడానికి మానవాళి చేయాల్సిన పనుల్లన్నీ చేస్తున్నది. వాతావరణ కాలుష్యంతో భారత్ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతున్నా పట్టించుకోవడం లేదు. పర్యావరణాన్ని పూర్తిగా దెబ్బతీసే పనులను పూనుకుంటోంది. భారత్ లాంటి దేశాల్లో ప్రజలపై అజమాయిషీ లేకపోవడం, వారిలో నైతికి బాధ్యత లేకపోవడంతో మనదేశం ఓ డంపింగ్ యార్డ్‌గా మారుతోంది. విపరీతమైన రసాయన ఎరువులు వాడడం వల్ల భూమి సారం తగ్గి పంటలు చేవలేకుండా పండుతన్నాయి. అవన్నీ క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయి. మానవ తప్పిదాల కారణంగా
ఉష్ణోగ్రతలు తగ్గి, శీతగాలులు మొదలయ్యేసరికి మన నగరాల్లోని కాలుష్య భూతం మరింత ఉగ్రరూపం దాలుస్తుంది. దట్టంగా వ్యాపించే పొగమంచులో దుమ్మూ, ధూళి కణాలతోపాటు కాలుష్యకారక ఉద్గారాలు కలగలిసి జనం ఊపిరితిత్తుల్లోకి చొరబడుతున్నాయి. కొంచెం కొంచెంగా ప్రాణాలను పీల్చేస్తుంటాయి. ఇటీవల ఢిల్లీలో కాలుష్యం కారణంగా క్రికెట్ మైదానంలో క్రీడాకారులు వాంతుల చేసుకున్నారు. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఈమధ్య జరిగిన క్రికెట్ టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక క్రీడాకారులు మాస్క్‌లు ధరించి పాల్గొన్నారు. ఇద్దరు ఫాస్ట్ బౌలర్లయితే ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులెదురై మైదానం నుంచి నిష్కమ్రించారు. వేకువజామునే పనుల కోసం రోడ్డెక్కేవారూ, బస్సుల కోసం ఎదురుచూసే బడి పిల్లలు, ఉద్యోగ బాధ్యతల కోసం కార్యాలయాలకు వెళ్లాల్సినవారూ ఈ పొగమంచులో చిక్కుకుంటున్నారు. అభివృద్ధి పేరిట సమస్తమూ నగరాల్లో కేంద్రీకరించడంలోనే ఈ సంక్షోభం పుడుతోంది. పరిశ్రమలు, భారీ వాణిజ్య సముదాయాలు, సాఫ్ట్‌వేర్ పరిశ్రమలు, అనేకానేక ప్రభుత్వ కార్యాలయాలూ నగరాల్లోనూ, వాటి చుట్టుపట్లా ఉండటం వల్ల అక్కడ జనాభా కేంద్రీకరణ తప్పడం లేదు. అటు పల్లెసీమల్లో ఉపాధి అవకాశాలు తగ్గి వారంతా నగరాలకు వలస రావలసివస్తోంది. ఇలాంటివారందరికీ అవసరమైన ప్రజా రవాణా వ్యవస్థను నిర్వహించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. రాని బస్సుల కోసం గంటల తరబడి రోడ్లపై వేచి చూడటం కంటే అప్పో సప్పో చేసి సొంతంగా వాహనం సమకూర్చుకుంటే సమస్య తీరిపోతుందన్న ధోరణి పౌరుల్లో పెరుగుతోంది. పరిశ్రమలు వదిలే కాలుష్యం చాలదన్నట్టు అదనంగా ఈ వాహనాలు వదిలే ఉద్గారాలు వాతావరణంలో కేన్సర్ కారక కార్సినోజిన్‌ల వ్యాప్తికి కారణ మవుతున్నాయి. హైదరాబాద్ మొదలుకొని దేశ రాజధాని న్యూఢిల్లీ వరకూ ఇదే స్థితి నెలకొంది. పరిశ్రమలనుంచి, వాహనాలనుంచి వెలువడే కాలుష్యం తోడై నగరాల్లో ప్రమాద తీవ్రత హెచ్చుతుంది. ఒక్క శీతాకాలం మాత్రమే కాదు… ఏటికేడాదీ కాలుష్యంతో నిండి ఉండే న్యూఢిల్లీ గురించి చెప్పనవసరమే లేదు. మొక్కుబడిగా వాహనాల నియంత్రణ అమలు చేయడం కాక… వాటి అమ్మకాలను సైతం నియంత్రించడం, ప్రజా రవాణా వ్యవస్థను పటిష్ట పరచడం, పరిశ్రమలు కాలుష్య నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయో లేదో నిఘా పెట్టడంలాంటి చర్యలకు ఉపక్రమిస్తే కాలుష్యం దానంతటదే సర్దుకుంటుంది. కావలసినందల్లా దృఢ సంకల్పం… చిత్తశుద్ధి. ఆ రెండూ పాలకులకు కలగనంతకాలమూ కాలుష్యమూ, అందువల్ల కలిగే అనర్థమూ ఈ మాదిరే కొనసాగుతాయి. నానాటికీ ఉగ్రరూపం దాలుస్తాయి. సాధారణ సమయాల్లో కాలుష్యం గురించి పట్టనట్టుండే ప్రభుత్వాలు ముప్పు ముంచుకొచ్చాక ఏవో దిద్దుబాటు చర్యలు తీసుకోవడం తప్ప శాశ్వత చర్యలు కఠినంగా చేపట్టడం లేదు.కాలం గడుస్తున్నకొద్దీ అది పెరుగుతూ పోతుందే తప్ప తగ్గదు. ఈసారి
పరిస్థితి మరింతగా దిగజారుతున్నట్టు కనబడుతోంది. గ్రామాలు మొదలు పట్టణాల్లో సైతం ఈ దుస్థితి తప్పడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలు చేస్తున్న హెచ్చరికలు సైతం ప్రభుత్వాల చెవులకు సోకడం లేదు. ప్రభుత్వాలకు ముందు చూపు కొరవడి చేస్తున్న నిర్ణయాలే సమస్యను ఉన్నకొద్దీ పెంచుతున్నాయి. దేశంలో ఏ నగరం, పట్టణం చరిత్ర చూసినా ఇదే పరిస్థితి. కాలుష్యమయమైన నగరాలు, పట్టణాలతో పోలిస్తే అవి కాస్త మెరుగ్గా ఉండొచ్చుగానీ పూర్తి సురక్షితమైనవని నిర్ధారించలేం. నిజానికి ప్రభుత్వాలు తల్చుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరకకపోదు. విద్యా సంస్థలకు సెలవు లివ్వడం, వాహనాల నియంత్రణ, నిత్యావ సర సరుకులు తీసుకొచ్చే వాహనాలకు తప్ప ఇతర భారీ వాహనాలకు నగరంలో అనుమతి నిరాకరించడం వంటి నిర్ణయాలు సమస్యను పరిష్కరించలేవు. కనుక సమస్య యధాతథంగా ఉండిపోతుంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తీరును సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఆ మండలి స్పందిస్తున్న తీరు సరిగా లేదని దుయ్యబట్టింది. ప్రభుత్వ యంత్రాంగాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి సారాంశంలో నరమేథానికి పాల్పడటంతో సమానమని వ్యాఖ్యానించింది. ఇంతగా మందలించినా మళ్లీ అవే పరిస్థితులు పునరావృతమయ్యాయి. అంతర్జాతీయ నివేదిక వెల్లడించిన ప్రకారం కాలుష్యం పెరగడం వల్ల నెలలు నిండకుండానే పుట్టే పిల్లల సంఖ్య పెరుగుతున్నదని హెచ్చరించింది. కానీ ఎప్పటిలా నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది. దీనిపై కేంద్ర రాష్టాల్రు ఆలోచనచేయాలి. ప్రపంచం ఆలోచన చేయాలి. కాలుష్య కారకాలపై సీరియస్‌గా వ్యవహరించాలి. అప్పుడే మనం స్వేఛ్చగా బతకగలం.