కూతురి ఉద్యోగం కోసం భర్తను చంపేసింది…

తిరుపతి: మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని తత్వవేత్తలు చెప్పినవి అక్షరసత్యాలని నేటి సామాజిక పరిస్థితులను చూస్తుంటే నిజమేననిపిస్తోంది. ఆస్థికోసం కన్నవారినే హతమారుస్తున్న పరిస్థితులు ఒకవైపు కాసుల కోసం నవమాసాలు కన్న బిడ్డలను అంగట్లో అమ్మకానికి పెడుతున్న కన్నవారు మరొకవైపు మన కళ్ళముందే కనిపిస్తున్నారు. కాగా తాజాగా నేడు కుమార్తెకు ఉద్యోగం కోసం నూరేళ్ళు కలిసి జీవించాల్సిన భర్తనే కడతేర్చటానికి భార్య సిద్ధపడింది. సగటు భారత స్త్రీ కడుపున పుట్టిన బిడ్డలకంటే భర్తనే ఎక్కువగా కోరుకుంటుంది. అలాగే పుట్టినప్పటి నుండి చేయిపట్టుకుని నడిపించి విద్యాబుద్ధులు నేర్పిన కన్నతండ్రిని తన భవిష్యత్తు కోసం హత్య చేసిన కుమార్తెను చూసి మానవత్వం మంటకలిసిపోయిందనుకోవాల్సి వస్తోంది.
టీటీడీ దేవస్థానంలో పనిచేస్తున్న మనోహరయ్యకు భార్య శారద, ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె పావనికి వివాహమైంది. చిన్న కుమార్తె శిరీష బీటెక్ పూర్తిచేసింది. 10 ఏళ్లుగా భార్య, భర్తల మధ్య తరుచు గొడవలు జరుగుతుండేవి. చిన్న కూతురికి ఉద్యోగం రాసివ్వాలని, ఇప్పుడున్న ఇంటిని పూర్తి స్థాయిలో నిర్మించాలని శారద భర్తను కోరింది. ఇందుకు మనోహరయ్య నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఆవేశంలో శారద కుక్కర్ మూతతో భర్తను కొట్టడంతో కిందపడిన అతనిపై తల్లి కూతుళ్లు దిండుతో ముఖాన్ని గట్టిగా అదమడంతో మనోహరయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని శారద తమ్ముడైన బాబుకు చెప్పింది. హత్యకు ఉపయోగించిన వస్తువులను అతను మాయం చేశాడు. చివరకు పోలీసులు కూపీ లాగడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. నిందింతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తాజావార్తలు