కేసీఆర్‌తో లాలూచీ పడి
కేసీఆర్‌తో లాలూచీ పడి..
పారిపోయి వచ్చారు
– ఓటుకునోటు కేసు విచారణ నిష్పక్షపాతంగా చేయాలి
– శాంతియుత దీక్ష చేస్తున్న వైసీపీ నేతలను అరెస్టు చేయడం దారుణం
– విలేకరుల సమావేశంలో బొత్స సత్యనారాయణ
హైదరాబాద్, మే8(జనం సాక్షి) : గుంటూరు జిల్లా తుళ్లూరులో శాంతియుతంగా దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్టు ఆ పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన మంగళవారం విూడియాతో మాట్లాడుతూ.. తుళ్లూరు మండలంలోని శాకమూరులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హావిూ ఇచ్చి మరిచారన్నారు. దళిత నేతల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
మూడేళ్లుగా చర్యలేవి? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడుపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. కేవలం ఒక్క ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఈ కేసులో బాబు అడ్డంగా దొరకడం వల్లే ఏపీ ప్రజల హక్కులను పణంగా పెట్టి విజయవాడకు పారిపోయివచ్చారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంతో లాలూచీ పడి ఏపీ నీటి హక్కులను
రాసిచ్చారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వానికి చట్టం, రాజ్యాంగంపై గౌరవం ఉంటే ఓటుకు నోట్లు కేసు విచారణను నిష్పక్షపాతంగా చేయాలని సూచించారు. గత మూడేళ్లుగా ఈ కేసులో చర్యలు లేవంటే.. ఇక సామాన్యునికి ఏం న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. నాలుగేళ్లలో చంద్రబాబుపై చాలా అవినీతి ఆరోపణలొచ్చాయని, కానీ ఏ ఒక్క అంశంపై విచారణ చేయించుకోలేదన్నారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరిపై ప్రజలు ఆలోచన చేయాలని తెలిపారు. బాబుకు పరిపాలనపై పట్టు లేనందునే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ నేతలకు మహిళలు, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేవని పేర్కొన్నారు.
—————————————–