కొడవాలు ప్రాంతాల్లోనూ మరుగుదొడ్లు

విజయనగరం,నవంబర్‌30(జ‌నంసాక్షి): ఐటీడీఏ పరిధిలో ఉన్న కొండశిఖర గ్రామాల్లో కూడా మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఐటీడీఏ పీవో లక్ష్మీశా అన్నారు. ప్రతీ ఇంట్లో మరుగుదొడ్డి ఉంటేనే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకున్న వారమవుతామని అన్నారు. డిసెంబర్‌ 15లోపు మరుగుదొడ్లు నిర్మాణాలు ప్రారంభించకపోతే ప్రభుత్వం అందిస్తున్న రూ.15వేల పారితోషికం కూడా తర్వాత రావడం కష్టమని అన్నారు. ఇదిలావుంటే జిల్లాలో గ్రామస్థాయి నుంచి జిల్లా వరకు ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో మరుగుదొడ్లు నిర్మాణాల్లో వృద్ధి సాధించామని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ అన్నారు. డిసెంబరు 15లోగా మిగిలిపోయిన నిర్మాణాలు కూడా ప్రారంభిస్తామని అన్నారు. స్థలం లేనివారికి గ్రామంలోని ప్రభుత్వ స్థలం ఎంపిక చేసి మరుగుదొడ్లు నిర్మిస్తామని, ఇసుక సమస్యలు లేకుండా తహసీల్దారు, ఆర్‌డీఓలకు తెలిపామన్నారు. కలెక్టర్‌ ఇచ్చిన స్పూర్తితో గిరిజన గ్రామాల్లో ప్రచారం ఉధృతం చేశామని ఐటీడీఏ పీవో లక్ష్మీశా అన్నారు. గిరిజన ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి అడ్డంకులను అధిగమించేందుకు డివిజనల్‌ కార్యాలయంలో ఇసుక విభాగాలను ఏర్పాటు చేశామన్నారు. మరుగుదొడ్లను సకాలంలో పూర్తి చేసిన గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తామన్నారు. ఐటిడిఎ పరిధిలో అధికారుల కృషి వల్ల ఈ ఏడాది మలేరియా మరణాలను నివారించగలిగామని చెప్పారు. ఇంట్లో మరుగుదొడ్డి ఉంటే మహిళలకు ఆత్మగౌరవం పెరుగుతుందని అన్నారు. బహిరంగ మల విసర్జనను విడనాడాలని కోరారు. లక్ష్యసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గత ఏడాది జూన్‌ నాటికి జిల్లాలో 14 శాతం మరుగుదొడ్లు మాత్రమే ఉండేవని ప్రస్తుతం నేడు 50 శాతం కుటుంబాలకు ఇవి ఉన్నాయని అన్నారు.

తాజావార్తలు