కొనసాగనున్న సైకో సూదిగాడి దాడులు…

పశ్చిమగోదావరి : సైకో సూదిగాడి బాధితులు మళ్లీ ఆస్పత్రి పాలవుతున్నారు. గత నెల పశ్చిమగోదావరి జిల్లాలో తాను సైకో దాడికి గురయినట్లు ఆరోపించిన మహిళ ఇప్పుడు ఆస్పత్రి పాలయింది. తీవ్రంగా రక్తపు వాంతులు చేసుకుంటోంది. గత నాలుగు రోజుల నుంచి తన ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తోంది.రక్తపు వాంతులు చేసుకుంటున్న జ్యోతి అనే మహిళ గత నెలలో పశ్చిమగోదావరి జిల్లాలో సైకో సూదిగాడు తీవ్ర బీభత్సం సృష్టించాడు. మూడు రోజుల్లోనే తొమ్మిది మందికి ఇంజెక్షన్ ఇచ్చాడు. అప్పుడు అందరు ఆస్పత్రి పాలయ్యారు. బాధితులందరికి వెంటనే స్థానిక ఆస్పత్రుల్లో వైద్యం అందించారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. అనంతరం ఆ ఇంజెక్షన్‌ను పరీక్షలకోసం హైదరాబాద్‌ కూడా పంపారు. అందులో ఏమి లేదని నిర్ధారించారు. కానీ అదే నెల 30న జరిగిన దాడిలో ఒకరైన..పంపన జ్యోతి అనే మహిళ ఇప్పుడు తీవ్ర ఆనారోగ్యానికి గురయింది. రక్తపు వాంతులు చేసుకుంటోంది. మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు తీసుకొస్తుండగా తనకు ఎవరో సూదిగుచ్చారని బాధితురాలు జ్యోతి అప్పుడు వాపోయింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించిన అధికారులు వైద్యం అందించారు. వైద్యులు మాత్రం ఈమెపై ఇంజెక్షన్‌ దాడి జరగలేదని నిర్ధారించారు. జ్యోతి భ్రమ పడుతోందంటూ ఆమె ఆరోపణలు వాస్తవం కాదని కొట్టిపారేశారు.ఇప్పుడు తన ఆరోగ్యపరిస్థితిపై జ్యోతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అప్పుడు తాను చెప్పింది నిజమైనా..ఎవరూ పట్టించుకోలేదని బోరున విలపిస్తోంది. తన ఈ దుస్థితికి ఎవరు బాధ్యత వహిస్తారని జ్యోతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికైనా….బాధితురాలికి మెరుగైన వైద్య చికిత్స అందిచాల్సిన అవసరం ఎంతైన ఉంది. సైకో సూదిగాడు బీభత్సం సృష్టించి నెల కావస్తున్నా…పోలీస్ యంత్రాంగం ఆ సైకోను పట్టుకోలేకపోయిది. పరిస్థితి ఇలాగే ఉంటే సైకో మరింతగా రెచ్చిపోయే ప్రమాదం ఉందని స్ధానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజావార్తలు