కౌలు రైతులకు ఏదీ ఆదరణ
ఏలూరు,ఆగస్ట్30: కౌలు రైతులపై ప్రభుత్వం కనికరం చూపడం లేదు. పెట్టుబడులు భారమవుతున్న తరుణంలో రుణ అర్హతకార్డుల ద్వారా బ్యాంకు రుణాలు పొందవచ్చని, కౌలు రైతులకు రక్షణ హస్తంలా రుణ అర్హత కార్డు ఉపయోగపడుతుందని భావించిన అన్నదాతకు ప్రతి ఏటా లబ్ధి చేకూరడం లేదు. రుణ అర్హత కార్డులు ఇచ్చినా ఎలాంటి ఉపయోగం ఉండడం లేదు. ఏటా కౌలు రైతులకు అధికారులు, బ్యాంకర్లు మొండి చేయి చూపుతున్నారని సిపిఎం కార్యదర్శి డేగా ప్రభాకర్ అన్నారు.ప్రస్తుతం 60 శాతం కౌలు రైతులే సాగు చేస్తున్నారు. జిల్లాలో కౌలు రైతులను అధికారులు గుర్తించినా చాలామందికి గుర్తింపు కార్డులు అందలేదన్నారు. భూములు కలిగిన వారు గ్రామాల్లోనే ఉన్నా వ్యవసాయం చేయలేని స్థితిలో కౌలుకు ఇస్తున్నారు. అనేక కారణాల చేత ఎక్కువమంది కౌలుకు తమ పొలాలను ఇవ్వడంతో కౌలుదారులు పెరిగారు. దీంతో గ్రామాల్లో పెట్టుబడిదారులు కూడా పెరిగారు. వ్యవసాయ భూములున్న రైతులు వారి భూములపై బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి అప్పులు పొందుతున్నారు. కౌలుదారులు మాత్రం పెట్టుబడీదారుల వద్ద ఎక్కువ వడ్డీలకు అప్పులు తీసుకుని సాగు చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా నష్టపరిహారం కూడా రైతులే పొందేవారు. దీంతో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. కార్డుల జారీకి సంబంధించి నేటికీ ఆటంకాలు ఎదరవుతూనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో కొందరు వీఆర్వోలు రైతులకు చెప్పిన తర్వాతనే కార్డులు జారీ చేస్తున్నారు. కొందరు పెద్ద మొత్తంలో పొలాలను కౌలుకు చేస్తున్నా వారికి ఐదెకరాలకు మించి కార్డులు ఇవ్వడం లేదు. రైతులు కార్డుకు దరఖాస్తు చేసుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వారికి కార్డులు అందజేయాలి.ఈ కార్డులతో పంట రుణాలు, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పంటల బీమా, సబ్సిడీ పరికరాలు తదితర వాటిని పొందవచ్చని ఆశించిన కౌలు రైతులకు నిరాశే ఎదురైంది. బ్యాకులు రుణాలు ఇవ్వకపోవడంతో అధిక వడ్డీలకు ప్రయివేటు వ్యక్తుల నుంచి రుణాలు తెచ్చి పంటలు వేసుకోవాల్సి వస్తోందిన ప్రభాకర్ అన్నారు. అధికారులు అనుసరిస్తున్న విధానాలతో సాధారణ రైతుల రుణాలే తలనొప్పిగా మారిన తరుణంలో ఇక కౌలు రైతులను అధికారులెవరూ పట్టించుకోవడం లేదు.కౌలు రైతులు తమకు రుణం అందడం లేదని చేస్తున్న వినతులను గుర్తించాలని అన్నారు.