కౌలు రైతులకు దక్కని సంక్షేమం
సర్కార్ నిర్లక్ష్యమే కారణమంటున్న నేతలు
ఏలూరు,మే7(జనం సాక్షి):ప్రభుత్వాల చిన్నచూపునకు బ్యాంకుల సహాయ నిరాకరణ తోడవడంతో వ్యవసాయ పెట్టుబడుల కోసం కౌలు రైతులు పడుతున్న అగచాట్లు పడుతున్నారని కౌలురైతుల సంఘం నాయకుడు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నేళ్లయినా కౌలురైతులను సరిగా గుర్తించడం లేదన్నారు. అన్ని విషయాల్లో వారికి సహాయనిరాకణ ఎదురవుతోందన్నారు. చట్టాలు తీసుకుని వచ్చినా తమకు అండగా ఉండడం లేదన్నారు. సంపద సృష్టిలో కౌలు రైతుల భాగస్వామ్యం అత్యధికమైనప్పటికీ చంద్రబాబు సర్కారు వారిని ఆరోవేలుగా జమకట్టిందన్నారు. ఇందుకు గత మూడేళ్లలో వారికి పంపిణీ చేసిన బ్యాంక్ రుణాలే ఇదర్శనమని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం సాగు విస్తీర్ణంలో 60 శాతానికిపైన కౌలు రైతులే
సేద్యం చేస్తున్నారు. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 70, 80, 90 శాతం భూమిని వారే సాగు చేస్తున్నారు. వాస్తవ సాగుదారులైనప్పటికీ, పంటల ఉత్పత్తిలో, ఏపీలో 16 లక్షల మంది కౌలు రైతులుంటారని ప్రభుత్వమే లెక్కలేసింది. 20 లక్షలకు పైమాటేనని రైతుసంఘాలు చెబుతున్నాయి.
కౌలు రైతులకు సంస్థాగత పరపతి కల్పించే విషయంలో ప్రభుత్వాల వైఫల్యం ఆనవాయితీగా వస్తుండగా కౌలు రైతులకు బ్యాంక్ రుణాలని ప్రతి ఏటా చెబుతున్నా అమలు కావడం లేదన్నారు. భూమిపై సర్వ హక్కులూ ఉన్న రైతులకే బ్యాంకులు అప్పులివ్వని దుస్థితి ఉందన్నారు. వ్యవసాయంలో మార్కెట్ శక్తుల ఆధిపత్యం పెరగడం, భూసంస్కరణలు జరగకపోవడం వలన ఏపీలో కౌలు రైతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అంచనా వేసిన మేరకైనా సర్కారు కౌలు రైతులను గుర్తించి బ్యాంకు రుణాలిప్పించిందా అంటే అదీ లేదు. కౌలు రైతులు తమ హక్కుల కోసం దశాబ్దాల తరబడి పోరాడుతున్నారు. తమకు కనీసం సంస్థాగత పరపతి, ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలని కోరుతున్నారు. రైతుమిత్ర (ఆర్‌ఎంజి), సంయుక్త భాగస్వామ్య సంఘాల్లో చేర్చి అప్పులివ్వాలని గతంలో నిర్ణయించినప్పటికీ బ్యాంకులు పెద్దగా
స్పందించలేదు. రైతుల స్థితిగతులపై అధ్యయనం చేసిన జయతిఘోష్, కోనేరు రంగారావు కమిటీలు కౌల్దార్లకు బ్యాంక్ రుణాలిప్పించాలని సిఫారసు చేసినా పెద్దగా ఫలితం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కౌల్దార్లకు రుణ అర్హత కార్డు (ఎల్‌ఇసి)ల జారీకి చట్టం తెచ్చింది. భూయజమానితో సంబంధం లేకుండా రెవెన్యూ అధికారులు గ్రామ సభలు నిర్వహించి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. నేటికీ గ్రామాల్లో భూస్వాములు, పెత్తందార్ల ఆధిపత్యం కొనసాగుతున్నందున కౌల్దార్లుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదలకు కార్డులు రావట్లేదన్నారు. బ్యాంకులు కౌలు రైతుల రుణాలే ఎన్‌పిఏలుగా పేర్కొంటే ప్రభుత్వం కూడా దానిని అంగీకరించడం సరికాదని శ్రీనివాస్ అన్నారు. రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెట్టింది. వడ్డీ మాఫీ, వడ్డీ రాయితీ పథకాల గురించి చెప్పనవసరం లేదు. ఎల్‌ఇసి లేని వారికి సాగు ధృవీకరణ పత్రాలన్నా పెద్దగా ఉపయోగం లేదు. వ్యవసాయం గిట్టుబాటుకాక, ప్రైవేటు అప్పులతో రుణగ్రస్తులై విధిలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న కౌల్దార్లను అసలు రైతులుగానే గుర్తించట్లేదన్నారు.