కౌలు రైతుల్లో ఆందోళన
ఈ-క్రాప్‌లో నమోదు కోసం నానా తంటాలు
గుంటూరు,నవంబర్16(జనంసాక్షి): కౌలు రైతులు మరోమారు దగాపడ్డారు. పండించిన పత్తిని అమ్ముకోవడానికి నానాయాతన పడుతున్నారు. కౌలు రైతుల పేర్లు ఈ-క్రాప్ బుకింగ్‌లో నమోదు కాలేదు. వారు సాగు ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకోవాలని నిబంధన పెట్టారు. ఇందుకోసం రైతులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ-క్రాప్ బుకింగ్‌లో నమోదైన వారి నుంచి మాత్రమే పత్తి కొనుగోలు చేస్తామని సిసిఐ అధికారులు ప్రకటించారు. అయితే రైతుల పేర్లు, సాగు విస్తీర్ణం నమోదులో పెద్ద ఎత్తున తప్పులు దొర్లాయి. దీంతో తాము తీసుకువచ్చిన సరుకుకు తేడాలు ఉన్నాయని చెబుతూ కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యల పేరుతో కంప్యూటర్లు పనిచేయడం లేదని, ఈ-క్రాప్ బుకింగ్ వివరాలు అందుబాటులో లేవని రకరకాల కారణాలను అధికారులు చెబుతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత కష్టపడి సిసిఐ కేంద్రాలకు వెళితే యథాతథంగా కొనుగోలు చేస్తారా అంటే అదీ లేదు. నాణ్యత లేదని తిప్పి పంపుతున్నారు. నాణ్యత ఉంటే సాంకేతిక సమస్యలను సాకుగా చూపుతున్నారు. గుంటూరు జిల్లాలో ఈ ఏడాది పత్తి విక్రయాలకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేస్తామని ఏర్పాటు చేసిన సిసిఐ కేంద్రాల్లోనూ నానా అగచాట్లకు గురవుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక ఆంక్షలు రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. జిల్లా మొత్తం విూద 11 కేంద్రాల్లో పత్తి కొనుగోలు ప్రారంభం అయింది. ఈనెల 6 నుంచి దశల వారీగా కొనుగోలు ప్రారంభించారు. మొదటి విడత ఎకరాకు రెండు క్వింటాళ్లు పత్తి దిగుబడి రాగా నాలుగు లక్షల ఎకరాలకు దాదాపు ఎనిమిది లక్షల క్వింటాళ్ల వరకూ దిగుబడి వచ్చినా ఇప్పటి వరకూ కేవలం రెండు వేల క్వింటాళ్లను మాత్రమే సిసిఐ కొనుగోలు చేసింది. జిల్లాలో గత నెలలో కురిసిన వర్షాలకు పత్తి తడిసి రైతులు నష్టపోయారు. దీంతో నాణ్యత లేదనే కారణంగా క్వింటా రూ.2 నుంచి మూడు వేలకు విక్రయించుకుంటున్నారు.ఎకరాకు గరిష్టంగా 10 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేయాలని నిబంధన విధించారు. దీని వల్ల అధిక దిగుబడి సాధించిన రైతులు తమ ఉత్పత్తిని ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది నాలుగు లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఎకరాకు సగటున 15 క్వింటాళ్ల వరకూ దిగుబడి రావచ్చునని అంచనా వేస్తున్నారు. సిసిఐ ప్రకటించిన మద్దతు ధర రూ.4320కకు విక్రయించుకునేందుకు ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా రైతులు తమ ఇళ్లు, పొలాల వద్ద నేరుగా వ్యాపారులకు విక్రయించుకుంటున్నారు. వ్యాపారులు క్వింటా రూ.3 వేల నుంచి రూ.4 వేల మధ్య కొనుగోలు చేస్తున్నారు. పొలం నుంచి సిసిఐ కేంద్రానికి తీసుకురావడానికి రవాణ ఖర్చులు, అధికారుల అభ్యంతరాలు, ఆంక్షల నేపథ్యంలో రైతులు ఇక్కడకు రావడానికి ఆసక్తి కనబర్చడం లేదని చెబుతున్నారు.