గల్లా అరుణకుమారి రాజకీయ ఆదర్శం
రాజకీయాల్లో కుటుంబంలో ఒక్కరే నినాదం
చంద్రగిరి నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయం
అధినేత బాబుకు వెల్లడించిన గల్లా
ఆమె తప్పుకోవడంపై రకరకాల ఊహాగానాలు
చిత్తూరు,మే3(జనం సాక్షి): ఆదర్శరాజకీయాలు పాటిస్తూ తెలుగుదేశం పార్టీకి మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి గుడ్‌బై చెప్పారు. జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ పదవి నుండి తప్పుకున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తన నిర్ణయాన్ని తెలిపారు. తనయుడు ఎంపీ గల్లా జయదేవ్‌కు అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె వివరించారు. దీంతోపాటు కుటుంబంలో ఒకరు మాత్రమే క్రియాశీల రాజకీయాల్లో ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అయితే ప్రత్యేక ¬దా డిమాండ్‌తో రాజకీయాలు వేడెక్కిన వేళ.. సాధారణ ఎన్నికలు సవిూపిస్తున్న సమయాన.. తెలుగు దేశంపార్టీలో చిన్న కుదుపుగా భావిస్తున్నారు. .. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చంద్రగిరి ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తనను తప్పించాలంటూ గల్లా అరుణకుమారి ముఖ్యమంత్రిని కలిసి విన్నవించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డితో కలిసి అరుణకుమారి అమరావతిలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. జిల్లా రాజకీయాలతో పాటు ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గంపై చర్చించినట్లు సమాచారం. తన కుటుంబం నుంచి ఒక్కరే క్రియాశీలక రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించామని, తన కుమారుడు జయదేవ్ గుంటూరు నుంచి ఎంపీగా ఉన్నందున తనను చంద్రగిరి పార్టీ బాధ్యతల నుంచి తప్పించాలంటూ ఆమె అధినేతను కోరారు. ఎన్నికల వరకూ విూరే కొనసాగాలని చంద్రబాబు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, ఒకే కుటుంబం నుంచి వేర్వేరు జిలాల్లో ఇద్దరు రాజకీయాల్లో కొనసాగడం కష్టంగా ఉందని, చంద్రగిరికి వేరొకరిని నియమిస్తే మద్దతిచ్చి గెలిపించుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ అభ్యర్థిని విూరే సూచించాలంటూ చంద్రబాబు ఆమెకే ఆ బాధ్యతను అప్పగించినట్లు తెలిసింది. అరుణకుమారి కూమార్తె డాక్టర్ రమాదేవి పేరును భేటీలో పాల్గొన్న పార్టీ నాయకులు ప్రస్తావించగా.. అందుకు ఆమె విముఖత చూపారు. ఆమె వైద్యురాలిగా పెద్ద ఆస్పత్రిని నిర్మిస్తున్నారని, రాజకీయాలపై తన కూతురికి ఆసక్తి లేదంటూ దాటవేసినట్లు తెలిసింది.
ఉన్నట్టుండి అరుణకుమారి ముఖ్యమంత్రిని కలవడం, తనను చంద్రగిరి నుంచి తప్పించాలని కోరడం వెనుక పార్టీ వర్గాలు రకరకాల కారణాలను విశ్లేషిస్తున్నాయి. పలువురు నాయకులు ఇదే విషయమై స్పందించారు. 1989లో తొలిసారి చంద్రగిరి నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. తర్వాత 1994 ఎన్నికల్లో
చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి 1999, 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. 2004 నుంచి రెండు పర్యాయాలు వివిధ శాఖలకు మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెదేపాలో చేరిన ఆమె.. 2014లో ఆ పార్టీ తరఫున ఓడిపోయారు.
గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తనకు, తన అనుచర వర్గానికి పార్టీలో సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదన్నది అరుణకుమారి వర్గం అభియోగం. ఇటీవల తెదేపాలో చేరిన పలువురికి కీలకమైన నామినేటెడ్ పదవులు
కట్టబెట్టినా.. అందులో ఆమె వర్గం వారు లేరని చెబుతున్నారు. నియోజకవర్గ పరిధిలో అధికారుల బదిలీల్లో ఆమె ప్రమేయం పని చేయడం లేదు. గత ఏడాది ఆగస్టులో దామినీడు వద్ద ఇళ్ల నిర్మాణ ప్రారంభోత్సవంలో ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇళ్ల నిర్మాణమంతా చంద్రగిరి నియోజకవర్గంలో
చేపట్టగా.. లబ్దిదారులంతా తిరుపతిలో ఓటర్లుగా ఉన్నారు. తద్వారా తనకు, పార్టీకి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రయోజనం లేదంటూ ప్రస్తావించారు. దీన్ని సరిచేయాలని కోరినా స్పందన లేదన్నది ఆమె వర్గం వాదన. ప్రొటోకాల్ పరంగానూ ఆమె ప్రస్తుతం పదవిలో లేరు. అధికారిక కార్యక్రమాల్లో ప్రాధాన్యం లోపించందన్న అభిప్రాయంతో ఉన్నారు. ఆమె తనయుడు గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికల్లోనూ గుంటూరు నుంచి పార్లమెంటుకు పోటీ చేయనున్నారని తెలుస్తోంది. అక్కడ దృష్టి సారించేందుకే ఇక్కడి బాధ్యతలు వద్దనుకున్నారని పార్టీ వర్గాల వాదన. చంద్రగిరి పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న చర్చలో ప్రధానంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాకాల మండలవాసి పులివర్తి శ్రీనివాస్ అలియాస్ నాని పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. తర్వాత దివంగత ఎమ్మెల్సీ, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు తనయుడు గాలి భాను పేరును పరిశీలించారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఆశించిన భానుకు సొంత కుటుంబం నుంచే వ్యతిరేకత ఎదురైంది. ఆయణ్ను కాదని తల్లి సరస్వతమ్మను ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దింపుతున్నారు. మరోవైపు పార్టీ స్థానిక సీనియర్ నేత పేరం హరిబాబు, మాజీ ఎమ్మెల్యే మేడసాని వెంకట్రామానాయుడు మనవడు ఇందు శేఖర్లు.. ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే, అరుణకుమారి సూచన మేరకే అక్కడి వేరొకరిని నియమించాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోందని సమాచారం.
———