గిట్టుబాటు ధరలే అసలు సమస్య
ఏటా తప్పని తిప్పలతో కుదేలవుతున్న అన్నదాత
హైదరాబాద్/ అమరావతి,మే8(జనం సాక్షి): మార్కెట్లు కళకళ …రైతులు వెలవెల అన్నచందంగా ప్రస్తుతు పరిస్థితి తయారయ్యింది. ఇది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆయా కేంద్రాల్లో వ్యవసాయ మార్కెట్లు ధాన్యం కొనుగోళ్లతో కళకళ లాడుతున్నాయి. మార్కెటకు ధాన్యం విరివిగా తరలివస్తున్నా మద్దతు ధరలు దక్కడం లేదన్న రైతులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా అంతిమంగా వ్యాపారులదే పైచేయిగా మారుతోంది. వారు చివరగా నిర్ణయింఇన దరలే అమలువుతున్నాయి. సిసిఐ,మార్క్‌ఫెడ్‌లు ఏనాడు పూర్తిస్థాయిలో కొనుగోల్లు చేయడం లేదు. చేసినా అంతంతమాత్రంగానే ఉంటాయి. దీంతో మార్కెట్లలో ధరలను ప్రభుత్వాలు నిర్ణయించినా, ప్రత్యేక ఏర్పాట్లు చేసినా ఏదో ఒక కారణంతో తక్కువ ధరలకే వ్యాపారులు ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో ఆరుగాలం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలన్నవి కేవలం
నామామత్రంగానే సాగుతున్నాయి. ఆయా పంట ఉత్పత్తుల రాకతో కళకళలాడుతున్న మార్కెట్‌లు
రైతులను కదిలిస్తే మాత్రం దీనగాధలే వినిపిస్తున్నారు. మొన్నటి వరకు వెలవెలబోయిన మార్కెట్‌యార్డులు రైతులు, వ్యాపారులు, హమాలీలతో సందడిగా మారాయి. వారం రోజుల నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కావడంతో ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాలతో పాటు పెద్ద ఎత్తున మార్కెట్లకు తీసుకొస్తున్నారు. ఇందులో పత్తి,మిర్చి, సోయా, వరి,మక్కజొన్న తదితర ధాన్యాలు ఉన్నాయి. దీంతో ఏ మార్కెట్లో చూసినా ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నా మద్దతు ధరను కల్పించడంతో పాటు అనేక సౌకర్యాలను చూపుతున్నా మార్కెట్లలో ధాన్యం అమ్మకాలకు పడిగాపులు తప్పడం లేదు. ధాన్యం నిల్వకు గోదాములు నిర్మించడంతో పాటు రైతుబంధు పథకం ద్వారా బీమా, రుణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అలాగే రైతులు బస చేసేందుకు గెస్ట్‌హౌజ్‌లు.. భోజన వసతి లాంటివి కూడా ఉన్నాయి. దళారులకు చెక్ పెట్టేందుకు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేస్తున్నది. ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. మొత్తంగా వ్యవసాయ మార్కెట్‌లు గత కొన్ని రోజులుగా కొనుగోళ్లతో మార్కెట్లలో సందడి ఉంది. కొనుగోళ్లు ప్రారంభం కావడంతో రైతులు, వ్యాపారులు, హమాలీలతో సందడిగా మారింది. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడం తో పాటు వ్యాపారులను మోసాలనుంచి రైతులను కాపాడేందుకు ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్లు ఇన్నాళ్లు ఆలనా పాలనా లేక నిర్వీర్యమై పోయాయి. ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతాంగానికి ఆన్‌లైన్ పద్ధతిలో చెల్లింపులు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా మద్దతు ధరలే రైతులును నిరాశకు గురిచేస్తు న్నాయి. ప్రభుత్వ ప్రచారంతో రైతులు కూడా దళారులకు దూరంగా మార్కెట్లలో అమ్మడానికి ఆస్తకి చూపుతున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత మార్కెట్లకు పాలక వర్గాలను నియమించారు. పాలకవర్గాల నియామకంలోనూ రిజర్వేషన్‌లు అమలు చేసారు. మహిళలకు కూడా పాలకవర్గాల్లో చోటు కల్పించారు. ముందస్తుగా పాలకవర్గాలను నియమించి విధి విధానాలు, నియమ నిబంధనలు ఉల్లంఘించకుండా మార్కెట్లలో కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలు, సౌకర్యాల వల్ల రైతులు తమ ధాన్యాన్ని మార్కెట్లకే తెచ్చి అమ్ముకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆరుగాలం కష్టపడి పనిచేసి పంటలు పండించే రైతులకు గిట్టుబాటు ధర కల్పించా లని, మార్కెట్లలో రైతులకు అన్ని విధాలా సౌకర్యాలను ఏర్పాటు చేసి ఇబ్బందులు కలగకుండా చూడాలనే ప్రభుత్వ సంకల్పమని తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు చెబుతున్నారు. ప్రభుత్వ
ఆదేశాలకు అనుగుణంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పాటిస్తుండటంతో మార్కెట్‌కు వచ్చే రైతులు ఆనందంగా తమ పంటలను విక్రయిస్తున్నారని అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్లను అభివృద్ధి చేయడం, రైతుల కోసం పాటుపడే వారికి పాలకవర్గాల్లో చోటు కల్పించడం చేసిందని అన్నారు. అలాగే పలు మార్కెట్ యార్డుల్లో ఇప్పటికే భోజన కోసం సద్దిమూల పథకం అమలవుతోంది. త్వరలోనే మిగతా మార్కెట్లలో కూడా సద్దిమూట పథకాన్ని ప్రారంభించనున్నట్ల మంత్రి వెల్లడించారు. ఈ పథకం ద్వారా రైతులకు మధ్యాహ్నం సమయంలో కేవలం రూ.5లకే నాణ్యమైన భోజనం పెడతారు. కొనుగోళ్లలో ఎలాంటి అవాంతరాలు, మోసాలు లేకుండా సజావుగా సాగుతున్నాయా అన్నదే పర్యవేక్షణ లేకుండా పోతున్నది. అయితే మార్కెట్లలో ధరల హెచ్చుతగ్గులు ఉంటాయని మార్కెట్ పాలకవర్గాలు చెబుతున్నాయి. ధాన్యం దిగుబడులు, నాణ్యత, తేమ ఆధారంగా ఇలాంటివన్నీ సహజమేనని
అంటున్నారు. రైతులు కూడా నిబందనల మేరకు ధాన్యం తీసుకుని వస్తే తగువిధంగా ధరలు పలుకు తాయని అంటున్నారు. ప్రధానంగా మార్కెట్లలో దళారీ వ్యవస్తను నిర్మూలించి పక్కాగా ఏర్పాట్లు చేశామని ఎపి వ్యవసాయమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. ఏమైనా ధరలు అనుకున్న విధంగా రావడం లేదన్న రైతులే ఎక్కువగా ఉంటున్నారు.
—–