గుంటూరు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి

గుంటూరు, పారిశ్రామికాభివృద్ధికి జిల్లాలో పెద్దపీట వేస్తున్నాం. బొల్లాపల్లి, దుర్గి, గురజాల, మాచర్ల తదితర మండలాల్లో ఇప్పటికే 41,179 ఎకరాల భూమిని గుర్తించాం. ఇందులో 7,337 ఎకరాలను సర్వే చేయగా అందులో 5,277 ఎకరాలు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఉంది. మిగిలిన భూమి సర్వే దశలో ఉంది..’ అని కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే సీఎం చంద్రబాబుకు నివేదించారు. విజయవాడలో శుక్రవారం నుంచి ప్రారంభమైన కలెక్టర్ల సదస్సుకు జిల్లా ప్రగతి నివేదికలతో కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మాచర్ల, గురజాలలో మొత్తం 1,403 ఎకరాల్లో ఎనిమిది పారిశ్రామికవాడలను ప్రతిపాదించామన్నారు. జిన్నింగ్‌, స్పిన్నింగ్‌ పరిశ్రమలో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులు నేపథ్యంలో వడ్డీరేటును తగ్గించే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. సిమెంట్‌ ప్రాజెక్టులు త్వరితగతిన నిర్మాణానికి మైనింగ్‌ లీజ్‌ డీడ్‌ని సర్వే నెంబర్లతో సంబంధం లేకుండా రిజిష్టర్‌ చేసే విషయాన్ని పరిశీలించాలన్నారు. రూ.6 నుంచి రూ.8 కోట్లు విడుదల చేసినట్లు అయితే యడ్లపాడులో నూతనంగా ప్రారంభించిన స్పైసెస్‌పార్కును నాలుగు వరసల రహదారితో ఐదో నెంబర్‌ జాతీయ రహదారికి అనుసంధానం చేస్తామన్నారు. జిల్లాలో నీరు-చెట్టు కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభమైన ఎంతో పురోగతిని సాధించామన్నారు. మొత్తం కాలువలు, చెరువులు కలిపి 1,027 వాటిల్లో 79 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని పూడిక తీశామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 4 లక్షల 46 వేల హెక్టార్లలో వరి, కంది, మిర్చి పత్తి పంటల సాగును రైతులు చేపట్టారని తెలిపారు. రుణమాఫీకి సంబంధించి ఇప్పటి వరకు 11 లక్షల 47 వేల 906 మంది రైతుల రుణ రికార్డులను బ్యాంకర్లకు అప్‌లోడ్‌ చేశామన్నారు. మొత్తం రూ. 887.78 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 4,404.68 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ.3,750 కోట్లను 4.15 లక్షల మంది రైతులకు పంపిణీ చేశామన్నారు. అమరావతి రాజధాని నగర భూసమీకరణ పురోగతిని కూడా కలెక్టర్‌ వివరించారు. గ్రామకంఠాల సమస్యను పరిష్కరించడంతో రైతులు స్వచ్ఛంధంగా ముందుకొస్తున్నారని తెలిపారు. మూడు రింగురోడ్ల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
ఎన్‌ఐడీని తాత్కాలికంగా ఏఎన్‌యూలో ఏర్పాటు చేసి అడ్మిషన్స్‌ ప్రారంభించామని, కేపిటల్‌ సిటీలోనే 30 నుంచి 50 ఎకరాలు భూమిని ఆ సంస్థకు కేటాయించేందుకు చర్యలు చేపట్టామన్నారు. నడికుడి – శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ భూసేకరణ వేగవంతం జరుగుతోందని, అలానే బాపట్ల – రేపల్లె హైవే విస్తరణ ప్రక్రియ కూడా ప్రారంభించామని తెలిపారు. పర్యాటకంగా జిల్లాని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రసాద్‌, హృదయ్‌ పథకాల కింద రూ.100 కోట్లతో అమరావతి టూరిజం సర్క్యూట్‌ అభివృద్ధికి డీపీఆర్‌ను అందజేశామని వివరించారు. జిల్లా అభివృద్ధికి కలెక్టర్‌ కాంతీలాల్‌ చేపట్టిన చర్యలను సీఎం అభినందించారు. జిల్లాని టూరిజం, ఇండసి్ట్రయల్‌ హబ్‌గా మార్చాలని సూచించారు.

తాజావార్తలు