గుల్‌బర్గ్‌ ఊచకోతలో 11 మందికి జీవితఖైదు

3

– మిగతా 13 మందిలో ఒకరికి 10 ఏళ్లు, 12 మందికి ఏడేళ్లు

– శిక్ష ఖరారు చేసిన స్పెషల్‌ కోర్టు

అహ్మదాబాద్‌,జూన్‌ 17(జనంసాక్షి):గోద్రా ఘటన అనంతరం జరిగిన గుల్బర్గ్‌ హత్యోదంతంలో దోషులుగా తేలిన 11 మందికి అహ్మదాబాద్‌ స్పెషల్‌ కోర్టు జీవిత కారాగారం విధించింది. జూన్‌ 2న 24 మందిని దోషులుగా నిర్ధారించిన స్పెషల్‌ కోర్టు శుక్రవారం తీర్పు ఖరారు చేసింది. 11 మంది చనిపోయేదాకా జైల్లోనే శిక్ష అనుభవించాలని, తక్కువ నేరానికి పాల్పడ్డ 13 మందిలో ఒకరికి పదేళ్ల జైలు, మిగిలిన 12 మందికి ఏడేళ్ల జైలుశిక్షను ఖరారు చేసింది. అయితే అదే సమయంలో ప్రభుత్వానికి ఉండే నేరస్తుల శిక్షను తగ్గించే అధికారాన్ని స్పెషల్‌ కోర్టు తోసిపుచ్చలేదు. దీనివల్ల జైల్లో వారి ప్రవర్తనపై సంతృప్తి చెందితే  శిక్షాకాలం ముగియకముందే వారికి విముక్తి లభించే అవకాశం ఉంది. వారు సమాజానికి ప్రమాదకరమైన శక్తులు కారని, వారు మారడానికి అవకాశం ఉన్న నేరస్తులుగా కోర్టు వ్యాఖ్యానించడం విశేషం. 2002, ఫిబ్రవరి 28న అహ్మదాబాద్‌ లోని గుల్బర్గ్‌ హౌసింగ్‌ సొసైటీలో 69 మంది ఊచకోత జరిగింది. అందులో కాంగ్రెస్‌ ఎంపీ ఎహసాన్‌ జాఫ్రీ కూడా ఉన్నారు. గుల్బర్గ్‌ హౌసింగ్‌ సొసైటీ అనేది ముస్లింలు అధికంగా ఉండే ఒక  రెసిడెన్షియల్‌ పాకెట్‌. ఇది 30 భవనాల సమూహం. 10 అపార్టుమెంట్‌ బ్లాకులున్నాయి. అయోధ్య నుంచి కరసేవకులు తిరిగి వచ్చిన దరిమిలా గోద్రాలో సబర్మతి ఎక్స్‌ ప్రెస్‌ ను దుండగులు దహనం చేయడం దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది. ఆ ఘటనలో 59 మంది సజీవదహనమయ్యారు. ఆ మరుసటి రోజే, అంటే 28 ఫిబ్రవరి 2002న గుల్బర్గ్‌ సొసైటీ దారుణం చోటు చేసుకుంది. అప్పుడు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఉన్నారు తొలుత దీనిపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక విచారణా బృందం (సిట్‌) దర్యాప్తు చేసి 63మందిని విచారణలో చేర్చింది. గుల్బర్గ సొసైటీ అల్లర్ల కేసులో మోడీ, తదితరులపై జకియా చేసిన ఫిర్యాదు ఆధారంగా సుప్రీంకోర్టు సిట్‌ను విచారణకు నియమించింది. అయితే ఈ కేసు నుంచి మోదీకి ఊరట లభించింది.దోషులందరికీ మరణశిక్ష లేదా కనీసం వారు చనిపోయేంతవరకు జైల్లోనే ఉండేలా తీర్పు ఇవ్వాలని స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌) తరఫున వాదించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అభ్యర్థించారు. ఇక బాధితుల తరఫు లాయరు ఎస్‌ఎం వోరా కూడా వీలైనంత ఎక్కువ శిక్ష పడాలని కోరారు. వేర్వేరు నేరాల కింద పడ్డ శిక్షలు ఏకకాలంలో కాకుండా ఒకటి తరువాత ఒకటిగా శిక్షను అమలు చేయాలని కోర్టుకు విజ్నప్తి చేశారు. దీనివల్ల దోషులందరూ జీవితకాలం కటకటాల్లోనే ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

కేసులో కీలకాంశాలు, నేరస్తులు

గుల్బర్గ్‌ సొసైటీ కేసు విచారణ ఏడేళ్లు కొనసాగింది. మొత్తం నలుగురు జడ్జిల ముందుకు ఈ కేసు వచ్చింది.జూన్‌ 2న 11 మందిని హత్యానేరం కింద దోషులుగా కోర్టు ధ్రువీకరించింది. వీహెచ్పీ లీడర్‌ అతుల్‌ వైద్యతో పాటు మరో 13 మందిని తక్కువ నేరానికి పాల్పడ్డ వ్యక్తులుగా తేల్చింది. ఇక 36 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది.ఆజీవిత కారాగార ఖైదీలు – కైలాశ్‌ దోభీ, యోగేంద్ర షెకావత్‌, జయేశ్‌ జింగార్‌, కృష్ణకళా, జయేశ్‌ పర్మార్‌, రాజు తివారీ, నారన్‌ చన్నేల్‌ వాలా, లఖన్‌ సింహ్‌ చుదాస్మా, భరత్‌ తెలి, భరత్‌ రాజ్‌ పుత్‌, దినేశ్‌ శర్మ.హత్యాయత్నం నేరం కింద పదేళ్ల జైలుశిక్ష పడ్డ ఏకైక వ్యక్తి మంగీలాల్‌ జైన్‌.ఏడేళ్ల జైలు శిక్ష పడ్డవారిలో – టి.సురేంద్రసింహ్‌ చౌహాన్‌, దిలీప్‌ పర్మార్‌, సందీప్‌ మెహ్రా, ముఖేశ్‌ శంఖల, ఏకే జింగార్‌, ప్రకాష్‌ పధియార్‌, మనీష్‌ జైన్‌, ధర్మేశ్‌ శుక్లా, కపిల్‌ శర్మ, సురేశ్‌ దోభీ, అతుల్‌ వైద్య, బాబు మార్వాడీ.మిగతా 12 మందిని మారణాయుధాలు కలిగి ఉండడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, దాడులకు పాల్పడడం వంటి నేరాలకు గాను శిక్ష విధించారు.