యెమెన్ తీరంలో 68 మంది జలసమాధి
` 74 మంది గల్లంతు
` 154 మంది ఆఫ్రికన్ వలసదారులతో వెళుతున్న పడవ బోల్తా
సనా(జనంసాక్షి): దక్షిణ యెమెన్ తీరంలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. పడవ బోల్తా పడి 68 మంది ఆఫ్రికన్ వలసదారులు మృతిచెందారు. 74 మంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి వలస ఏజెన్సీ మీడియాకు తెలిపింది.అబ్యాన్ ప్రావిన్స్ సమీపంలో 154 మంది ఆఫ్రికన్ వలసదారులతో వెళుతున్న పడవ బోల్తా పడిరది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి.యెమెన్‌లోని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) తెలిపిన వివరాల ప్రకారం 54 మంది వలసదారుల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. మరో పద్నాలుగు మంది మృతి చెందారు. ఈ మృతదేహాలను యెమెన్ దక్షిణ తీరంలోని అబ్యాన్ ప్రావిన్షియల్ రాజధాని జింజిబార్‌లోని ఆస్పత్రి శవాగారానికి తరలించారు. ఈ ఓడ ప్రమాదంలో 12 మంది వలసదారులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన ప్రయాణికులంతా గల్లంతయ్యారు. వీరంతా మృతిచెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు.పడవ ప్రమాదంలో అధిక సంఖ్యలో ప్రాణనష్టం సంభవించడంతో పెద్ద ఎత్తున సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు అబ్యాన్ భద్రతా డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది. తీరప్రాంతంలో చెల్లాచెదురుగా పలు మృతదేహాలు పడివున్నాయని అధికారులు చెబుతున్నారు. కాగా పడవ ప్రమాదాల్లో వలసదారులు మృతిచెందుతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. గత మార్చిలో యెమెన్, జిబౌటి తీరాలలో వలసదారులను తీసుకెళ్తున్న నాలుగు పడవలు బోల్తా పడ్డాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతిచెందగా, 186 మంది గల్లంతయ్యారు.