గాజా ప్రజల ఆకలి తీరుస్తాం


` అది కేవలం అమెరికాతోనే సాధ్యం
` అది నరమేధం కాదు.. కచ్చితంగా యుద్ధమే: ట్రంప్‌
వాషింగ్టన్‌(జనంసాక్షి):గాజాలో పరిస్థితులు రోజు రోజుకూ దుర్భరంగా మారుతున్నాయి. ఆహారం దొరక్క అకలి కేకలు వినిపిస్తున్నాయి. అక్కడి చిన్నారుల్లో పౌష్టికాహార లోపం స్పష్టంగా కనిపిస్తోంది.మరోవైపు హమాస్‌ చెరలో ఉన్న ఇజ్రాయెల్‌ పౌరుల పరిస్థితీ అంతే. ఇటీవల అక్కడి బందీలకు సంబంధించిన పలు దృశ్యాలు, వీడియోలు బయటకు వచ్చాయి. వాటిలో ఇజ్రాయెలీలు ఎముకల గూళ్లుగా మారిన శరీరాలతో దారుణస్థితిలో కనిపించడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. గాజా ప్రజల ఆకలి తీర్చాలనుకుంటున్నట్లు చెప్పారు. కేవలం అమెరికా మాత్రమే ఆ పని చేయగలదన్నారు. హమాస్‌పై ఇజ్రాయెల్‌ ప్రతిస్పందనను ‘నరమేధం’గా భావిస్తున్నారా? అని ట్రంప్‌ను విలేకరులు ప్రశ్నించగా.. దానిని నరమేధంగా తాను భావించడం లేదని, హమాస్‌- ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్నది యుద్ధమేనని అన్నారు. 2023 అక్టోబర్‌ 7న హమాస్‌ చేపట్టిన దుందుడుకు చర్యవల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయన్నారు. హమాస్‌ దాడిలో కొన్ని భయానక ఘటనలు జరిగాయని చెప్పారు. ‘’ గాజా ప్రజల కడుపు నింపాలనుకుంటున్నాం. కేవలం అమెరికా వల్లే అది సాధ్యమవుతుంది. దీనికోసం ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తున్నాం. గాజాలోని సామాన్య ప్రజలకు ఇజ్రాయెల్‌ అధికారులే నేరుగా ఆహారం అందించాలని కోరుకుంటున్నాం. లేదంటే పరిస్థితులు మరింత విషమించే అవకాశం ఉంది. అప్పుడప్పుడూ కొన్ని దుర్ఘటనలు జరుగుతుంటాయి. అలాగని ఎవరూ ఆకలితో అలమటించడం మాకిష్టం లేదు’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. మరోవైపు గాజా మానవతా నిధి (జీహెచ్‌ఎఫ్‌) తీరును ఐక్యరాజ్యసమితి (ఐరాస) తప్పుబట్టింది. జీహెచ్‌ఎఫ్‌ చేపట్టిన సహాయక చర్యలు గాజా ప్రజలను ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాయని మండిపడిరది. జీహెచ్‌ఎఫ్‌ ఆధ్వర్యంలోని ఆహార పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలు, అక్కడికి వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ దళాలు జరిపిన కాల్పుల్లో మే నుంచి ఇప్పటి వరకు 1000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐరాస పేర్కొంది.

భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తాం
` రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి దాన్ని బహిరంగ మార్కెట్‌లో విక్రయించి సొమ్ముచేసుకుంటోంది
` మళ్లీ ఆక్రోశం వెల్లగక్కిన ట్రంప్‌
వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై మరోసారి తన ఆక్రోశాన్ని వెల్లగక్కారు. ఇటీవల భారత్‌పై 25 శాతం ప్రతీకార సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్‌.. తాజాగా మరిన్ని సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. రష్యా నుంచి భారత్‌ భారీగా చమురు కొనుగోలు చేస్తోందని, ఆ చమురును మళ్లీ విక్రయిస్తోందన్నారు. బహిరంగ మార్కెట్‌లో చమురు విక్రయించి భారత్‌ లాభం గడిస్తోందంటూ ఆక్షేపించారు. భారత్‌ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు భారీగా ఆర్థిక వనరులు చేకూరుతున్నాయని, అందుకే ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపడం లేదని విమర్శించారు.ఈ మేరకు ఆయన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు. ‘‘రష్యాతో యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నారో వాళ్లకు అవసరం లేదు. అందుకే భారత్‌పై సుంకాలను మరింత పెంచబోతున్నాం’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. భారత్‌పై విధించిన 25 శాతం ప్రతీకార సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.