గూడు”కోసం తల్లడిల్లి.. ఆగిన నిరుపేద గుండె..సిరిసిల్ల పట్టణం నెహ్రు నగర్ లో విషాదం.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 14. (జనంసాక్షి). ఇంటి అద్దెలు కట్టలేక సతమతమవుతున్న పేదలకు సీఎం కేసీఆర్ అందించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తామన్న హామీ పేదల్లో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపింది. ఇటీవల సిరిసిల్లలో నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అందించడం కోసం అర్హుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. అర్హులను గుర్తించి లబ్ధిదారులను డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. అన్ని అర్హతలు ఉండి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు చేతికి రాకపోవడంతో నిరుపేదల్లో ఆందోళన మిగిల్చింది. సొంత ఇంటి కల కండ్లముంది చేజారి పోతుందనే మనోవేదన పేదలను తీవ్రంగా కుంగదీసింది. ఇంటి అద్దేల భారంతో సతమతమవుతూ గుడు కోసం తల్లడిల్లి ఓ నిరుపేద గుండె ఆగిపోయింది. ఈ విషద సంఘటన సిరిసిల్ల పట్టణం నెహ్రు నగర్ లో చోటుచేసుకుంది. స్థానికులు మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..
ఈర్ల రాజు(47) పది సంవత్సరాల క్రితం కుటుంబంతో సిరిసిల్లకు వలస వచ్చాడు. పట్టణంలోని నెహ్రు నగర్ లో ఉంటూ టైలర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పనిలేని రోజుల్లో దినసరి కూలీగా పనులకు వెళ్లేవాడు. భార్య శారద బీడీలు తిడుతూ కుటుంబానికి ఆసరాగా ఉండేది.చాలీచాలని ఆదాయంతో కుటుంబం గడవడమే కష్టంగా మారడంతో ఇంటి అద్దెలు తీరని భారంగా మారాయి. నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తున్న క్రమంలో రాజు కుటుంబం ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుంది. అధికారుల పరిశీలనలో అర్హత పొందిన డ్రాలో ఇల్లు రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ప్రభుత్వం ఇల్లు రాని వారికి నివేషణ స్థలాలు ఇస్తామని ఊరట కలిగించిన నివేషణ స్థలం కోసం అధికారుల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేకుండా పోవడంతో రాజు తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. గురువారం కూడా అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వచ్చి రాత్రి ఏడుస్తూనే నిద్రపోయాడాని శుక్రవారం ఉదయం ఎంత పిలిచిన లేవకపోవడంతో జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు మృతుని బంధువులు తెలిపారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రాజు చెందినట్లు తెలపడంతో నిరుపేద కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. మృతునికి భార్య శారద , కుమారుడు శశివర్ధన్ ఉన్నారు.
కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.
_ పంతం రవి.సిపిఐ నాయకులు.
అధికారులు చేసిన సర్వేలో అన్ని అర్హతలు ఉండి కూడా ఇల్లు రాకపోవడం పేదలకు శాపంగా మారిందని సిపిఐ నాయకులు పంతం రవి అన్నారు. ప్రభుత్వం మృతుని కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయడంతో పాటు పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని కోరారు.