గోదావరి జలాలతో లక్ష ఎకరాలకు నీరు
విశాఖపట్టణం,జనం సాక్షి ): పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు తరలించి చోడవరం నియోజకవర్గంలో లక్ష ఎకరాల మెట్ట భూములకు సాగు నీరందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని చోడవరం ఎమ్మెల్యే కెఎఎస్‌ఎన్‌ఎస్ రాజు స్పష్టం చేశారు. నియోజవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరందేలా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. చోడవరాన్ని ఇరిగేషన్, వ్యవసాయం రంగంలో అగ్రభాగాన నిలిపేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు.గోదావరి జలాల తరలింపులో భాగంగా మినీ రిజర్వాయర్ల నిర్మాణానికి ఎంపిక చేసిన ప్రాంతాలను పరిశీలించారు. గోదావరి జలాలతో చోడవవరం నియోజకవర్గం లోని బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల్లోని మెట్ట భూములకు సాగు నీరందిస్తామని అన్నారు. పోలవరం, ఏలేరు కాలువల ద్వారా గోదావరి జలాలు తాళ్లపాలెం వద్ద కలుస్తున్నాయని జమాదులపాలెం వద్ద లిఫ్ట్ నిర్మించి అక్కడి నుండి మండలంలోని వాకగెడ్డకు సరఫరా అయ్యే విధంగా చేస్తామని చెప్పారు. ఇక్కడ రిజర్వాయరు నిర్మించి పైపులైన్ ద్వారా కరక, పెదపూడి పెద్ద చెరువులకు నీరు సరఫరా అయ్యేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. పెదపూడిలో మినీ రిజర్వాయరు నిర్మిస్తారన్నారు. అక్కడి నుండి రోలుగుంట మండలం కొమరవోలు ఆవ వరకు గోదావరి నీరు పైపులైన్లు, సీసీ కాలువల ద్వారా ప్రవహించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తుందన్నారు. నీరు నిల్వ ఉండేలా ముందుగా మినీ రిజర్వాయర్లు నిర్మిస్తామన్నారు.
———-