చంద్రబాబుకు చెక్‌ పెట్టేలా బిజెపి వ్యవహారాలు?

అమరావతి,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): గతంలో ఓ మారు ప్రధాని మోడీ జగన్‌తో సమావేశం కావడం, ఆ తరవాత దానిపై చర్చ జరగడం వెనక పెద్ద బ్లాక్‌మెయిల్‌ వ్యవహారమే ఉండివుంటుందని మెల్లగా అర్థం చేసుకుంటున్నారు. ఎపిలో చంద్రబాబు దూకుడును తగ్గించి కత్తెర వేయడానికి జగన్‌ను పావుగా వాడుకున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. నీవులేకుంటే జగన్‌ను ఎగదోస్తాం అన్నరీతిలో బిజెపి గణం వ్యవహారాలు సాగినట్లు తాజాగా తెలుస్తోంది. దీంతో చంద్రబాబు కూడా కొంత వెనక్కి తగ్గి మోడీ పథకాలకు జై కొడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎలాంటి భేషజాలు లేకుండా కేంద్ర పథకాలను మెచ్చుకుంటూ మోడీ నిర్ణయాలను అభినందిస్తున్నారు. మరో అడుగు ముందుకు వేసి 2వేల నోట్లను రద్దు చేయాలని అంటున్నారు. అనేక సమస్యలను ఎపి ఎదుర్కొంటున్నా గట్టిగా కేంద్రాన్ని నిలదీయలేని దీనస్థితిలో బాబు ఉన్నారు. అధిక ధరల భారం నుంచి ప్రజలకు ఉపశమనం కల్పిస్తామని ప్రజలకు హావిూ ఇచ్చినా మోడీని అడలేని స్థితిలో ఉన్నారు. 2022 సంవత్సరం నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న మేరకు కార్యాచరణ కానరాకున్నా బాబు పట్టించుకోవడం లేదు. ఎపి విడివడ్డ తరవాత ఆర్థికంగా బాగోలేదని, ఇంకా లోటు బడ్జెట్‌తో నెట్టుకొస్తున్నామని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు పదేపదే చెబుతున్నా బాబు మాత్రం పెదవి దాటడం లేదు.అంతేగాకుండా జీఎస్టీ వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడటంతోపాటు రాష్ట్ర ఖజానాకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆంధప్రదేశ్‌ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు జీఎస్టీ కౌన్సిల్‌ కు లేఖ రాశారు. పన్నుల జాబితాలో ఉన్న మరి కొన్ని రంగాలను జీఎస్టీ నుంచి మినహాయించాలని లేదా తగ్గించాలని యనమల కోరారు. అయినా ఆ దిశగా కేంద్రం నుంచి కార్యాచరణ కనపడటంలేదు. గ్రావిూణ భారతం సుసంపన్నం కావాలంటే రైతుల, ప్రజల ఆదాయం పెరగాలి. రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో గిట్టుబాటు ధర కీలకమైనది. కాంగ్రెస్‌ పార్టీ అటకెక్కించిన స్వామినాథన్‌ కమిటీ సూచనలని మోదీ ప్రభుత్వం అమలుచేయాలని చూడడం లేదు. అచ్చేదిన్‌ అనే నినాదంతో అధికారంలోకి వచ్చినవారు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారు. పార్టీని దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలని మోదీ, షా ద్వయం విన్యాసాలు ప్రారంభించారు. అందులో బాగంగానే రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తాము అడిగినన్ని పార్లమెంటు సీట్లు తెలుగుదేశం పార్టీ ఇవ్వని పక్షంలో వైకాపాతో పొత్తు పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. పార్టీ బలోపేతంపై చూపుతున్న శ్రద్ధ దేశాభివృద్ధిపై, ప్రజా సమస్యలపై చూపడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా, తమ వ్యూహాలనకు పదను పెట్టడం మానడం లేదు. అందుకే జగన్‌ బూచి చూపడం ద్వారా బాబును కంట్రోల్‌ చేయాలని అనుకుంటు న్నట్లుగా ఉంది. ఉపాధి లేక, ఉద్యోగాలు లేక సామాన్య, మధ్యతరగతి ప్రజలు తల్లడిల్లిపోతున్నా రాజకీయ విన్యాసాలు మానడం లేదు. ఎపిలో అభివృద్దికి చర్యలు తీసుకోకుండా రాజకీయంగా బలపడేందుకు వ్యూహాలను సిద్దం చేస్తున్నారు. దీనిని గమనించి బాబు అడుగులు వేయకుంటే మోడీ అడుగుల కింద నలిగిపోవడం ఖాయం.

తాజావార్తలు