చంద్రబాబుపై హత్యా కేసు పెట్టాలి

– ఆరు నెలల్లో ఇది మూడో ప్రమాదం
– వరుస ప్రమాదాలు జరుగుతున్న నిద్రపోతున్నారా? 
– ప్రమాదాల నివారణకు ఏం చర్యలు చేపట్టారు
– ప్రభుత్వం తీరుతో అమాయక ప్రజల ప్రాణాలు పోతున్నాయి
– మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు అందించాలి
– వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
పశ్చిమ గోదావరి, మే16(జ‌నం సాక్షి) : ఏపీ సీఎం చంద్రబాబుపై హత్యాకేసు పెట్టాలని వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. బుధవారం ప్రజాసంకల్పయాత్రలో పాదయాత్ర చేస్తున్న ఆయన రామారావు గూడెం వద్ద విూడియాతో మాట్లాడారు. గోదావరి నదిలో లాంచీ ప్రమాదంపై జగన్‌ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. గడచిన ఆరు నెలల్లో ఆంధప్రదేశ్‌లో ఇది మూడో పడవ ప్రమాదమని, లైసెన్స్‌ లేని బోట్లు ఎలా తిరుగుతున్నాయని ప్రశ్నించారు. ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై హత్యా కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పాలన లోపం వల్ల జరిగిన ఈ ఘటనలు అన్ని ప్రభుత్వం చేసిన హత్యలేనని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 25 లక్షల పరిహారం
చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వరుసగా బోటు ప్రమాదాలు జరుగుతున్నా తగిన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం నిద్రపోతోందా? అంటూ నిలదీశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నుంచి టీడీపీ నేతల వరకూ లంచాలు తీసుకోవడం వల్లే ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 21 మంది బలయ్యారని, చంద్రబాబు సినిమా షూటింగ్‌ కోసం చేసిన పని వల్లే ఈ దారుణం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ తొక్కిసలాటపై విచారణ ఏమైందో తెలియడం లేదని చెప్పారు. ఈ ఘటన విచారణ జరిగితే చంద్రబాబుది తప్పు అని తేలుతుందని అన్నారు. అందుకే విచారణ నివేదిక బయటకు రావడం లేదని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేతలు, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు లాంచీ ప్రమాదం జరిగిన చోట సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు వైఎస్‌ జగన్‌ వెల్లడించారు.

తాజావార్తలు