ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌

అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రికార్డు విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన ట్రంప్.. అంచనాలను తలకిందలు చేస్తూ తన ప్రత్యర్థి డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై ఘన విజయం సాధించారు. ఆదేశ‌ 132 ఏండ్ల చ‌రిత్రలో నాలుగేండ్ల విరామం త‌ర్వాత తిరిగి ప్రెసిడెంట్ కాబోతున్న రెండో వ్యక్తిగా చ‌రిత్ర సృష్టించారు. ఇక వచ్చే ఏడాది జనవరి 20న ట్రంప్‌ అధ్యక్షడిగా శ్వేతసౌధంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో తాను చేసిన వాగ్దానాలను నెరవేర్చేందుకు ట్రంప్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం (Russia – Ukraine War)పై ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ( ladimir Putin) తో మాట్లాడినట్లు సమాచారం. ఎన్నికల ఫలితాల అనంతరం ట్రంప్‌.. పలువురు దేశాధినేతలతో ఫోన్‌లో సంభాషిస్తున్నారు. ఈ క్రమంలో గత గురువారం ఆయన రష్యా అధ్యక్షుడితో మాట్లాడినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ (Washington Post) తెలిపింది. ఈ క్రమంలో ఇరువురు నేతల మధ్య ఉక్రెయిన్‌ యుద్ధం చర్చకు వచ్చినట్లు పేర్కొంది. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని విస్తరించొద్దని పుతిన్‌ను ట్రంప్‌ కోరినట్లు వెల్లడించింది. ఐరోపాలో అమెరికా గణనీయమైన సైనిక ఉనికిని ట్రంప్‌ ఈ సందర్భంగా గుర్తు చేసినట్లు సదరు కథనం నివేదించింది. ఉక్రెయిన్‌ యుద్ధం గురించి పరస్పరం చర్చించి పరిష్కారాన్ని కనుగొందామని రష్యా అధినేతకు ట్రంప్‌ సూచించినట్లు అధికార వర్గాలను ఊటంకిస్తూ వాషింగ్టన్‌ పోస్ట్‌ తన కథనంలో వెల్లడించింది.

కాగా, తాను అధికారంలోకి వస్తే ఒక్క రోజులో ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధాన్ని ముగిస్తానంటూ ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఇటీవలే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కూడా ట్రంప్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య యుద్ధం గురించి చర్చకు వచ్చింది. టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సైతం ఈ సంభాషణలో పాల్గొన్నట్టు సమాచారం. ట్రంప్‌తో సంభాషణ అద్భుతంగా సాగిందని జెలెన్‌స్కీ అభివర్ణించారు. చర్చలు కొనసాగించడానికి, మా సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ట్రంప్ అంగీకరించారని చెప్పారు.

తాజావార్తలు