చంద్రబాబు అభివృద్ది సంక్షేమ పథకాలే గెలపించాయి: మంత్రుల వ్యాఖ్య
అమరావతి,సెప్టెంబర్1(జనంసాక్షి): రాష్ట్రంలో చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్లనే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తెదేపా విజయ దుందుభి మోగించిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. వైకాపాకు ఎలాంటి రాజకీయ నైతికత లేదని, సరైన విధానాలు లేవని ఆరోపించారు. ఈ తీర్పు చంద్రబాబు సమర్థతకు సంకేతమన్నారు.మొత్తం 48 డివిజన్లకు గాను ఆ పార్టీ 32 డివిజన్లలో విజయం సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకొంది. ఈ సందర్భంగా తెదేపా నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. కాకినాడ ఎన్నికల్లో తెదేపా గొప్ప విజయానికి కారణం గత మూడున్నరేళ్లుగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతో సీఎం చేరువయ్యారని చెప్పారు. రాష్టాన్న్రి అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు చంద్రబాబు పడుతోన్న కష్టాన్ని చూసి ప్రజలు ఓటు రూపంలో మంచి తీర్పు ఇచ్చారని కొనియాడారు. ఈ విజయంతో మరింత బాధ్యతను తమ భుజస్కందాలపై వేసుకొని ప్రజల్లోకి వెళ్లనున్నట్టు చెప్పారు. ప్రతిపక్ష వైకాపా నేతల అవాస్తవ ప్రకటనలు, అబద్ధపు మాటలు ప్రజలు నమ్మలేదని, రాబోయే రోజుల్లో ఆ పార్టీ అడ్రస్సే గల్లంతువుతుందని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కాకినాడలో ఎంతోమంది విజ్ఞులు, కార్మికులు, కష్టజీవులు ఉన్నారని, అందుకే అందరి అంచనాలను తలకిందులుచేస్తూ గొప్ప తీర్పునిచ్చారన్నారు. మిత్రపక్షం భాజపాతో కలిసి పోటీచేశామని, తొమ్మిది స్థానాల్లో బరిలో ఉన్న భాజపా అభ్యర్థులను గెలిపించేందుకు తీవ్రంగా కృషిచేశామని చెప్పారు. రాబోయే నాలుగేళ్లలో కాకినాడను మోడల్ సిటీగా మారుస్తామన్నారు.
మూడేళ్లలో సీఎం చంద్రబాబు పాలనకు ప్రజలు పట్టంకడుతూ ఇచ్చిన తీర్పు ఇది అని మంత్రి జవహర్ అన్నారు. కాకినాడ కార్పొరేషన్‌లో మూడుసార్లు కాంగ్రెస్‌కు ప్రజలు అవకాశం ఇచ్చినా వారు అన్యాయం చేశారని, దోపిడీలకు పాల్పడుతూ ప్రజల కనీస అవసరాలను సైతం తీర్చలేదని ధ్వజమెత్తారు. తమ
ఆకాంక్షలను నెరవేర్చేదిశగా సీఎం చంద్రబాబు పాలన కొనసాగుతున్నందునే.. ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని అన్నారు. ఇది ప్రజా విజయమని పేర్కొన్నారు.
పులివెందులలోనూ టీడీపీ విజయం సాధించడం ఖాయం. జగన్‌కు దమ్ముంటే పులివెందులలో రాజీనామా చేయాలి.’ అని మంత్రి కొల్లు రవీంద్ర సవాల్ విసిరారు. వైసీపీ నాయకులు నంద్యాలలో డబ్బులు పంచుతూ దొరికిపోయారని, కానీ ఫలితాలు వచ్చిన తర్వాత టీడీపీ డబ్బు పంపిణీ చేసి గెలుపొందిందని ఆరోపిస్తున్నారని, ఇది జగన్ దివాలాకోరు రాజకీయానికి పరాకాష్ట అన్నారు. నంద్యాల ఫలితాల తర్వాత జగన్‌లోని సైకో మరోసారి బయటికొచ్చారని అన్నారు. జగన్ గొప్ప నాయకుడు అని రోజా పొగడ్తలతో ముంచెత్తడం నెటిజన్లకు పెద్ద జోకుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. జగన్‌ను నమ్ముకుంటే తమ బతుకు బస్టాండే అనే భయం ఆ పార్టీ నాయకులను వెంటాడుతోందన్నారు. నంద్యాలలో శిల్పాను గెలిపించుకోలేని జగన్ మిగిలిన 20 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలనడం ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి అన్న చందంగా ఉందన్నారు. ఇప్పటి వరకు దళితులు, కైస్త్రవులు, ముస్లింలు వైసీపీ వైపు ఉన్నారనే అపోహను వైసీపీ నేతలు కల్పించారని, అయితే, నంద్యాల,కాకినాడ ఎన్నిక ఫలితాలతో ఆ అభిప్రాయం తప్పని తేలిందన్నారు. జగన్ రాజకీయ జీవితం ముగిసిందన్నారు.