చంద్రబాబు క్షమాపణ ఎందుకు చెప్పాలి?
– ఏపీ ప్రజలకు మోదీ, షాలే క్షమాపణలు చెప్పాలి
– మంత్రి గంటా శ్రీనివాస్‌రావు
– సోమువీర్రాజు వ్యాఖ్యలపై మండిపాటు
అమరావతి,మే12(జనం సాక్షి ) : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ పై జరిగిన రాళ్లదాడి ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ…’ అమిత్ షాకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు. క్షమాపణ చెప్పాల్సి వస్తే ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ఏపీ ప్రజలకు చెప్పాలన్నారు. తిరుపతి ఘటన ప్రజల్లో ఉన్న ఆవేశంతో అనుకోకుండా జరిగిందని, ముందస్తు ప్రణాళిక ప్రకారం జరగలేదన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి స్పందించి, తీవ్రంగా ఖండించారని గుర్తు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నారని అన్నారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఏపీకి అన్యాయం చేస్తుందని గంటా మండిపడ్డారు. కాబట్టే ప్రజల్లో ఆవేశం ఇలాగే ఉంటుందని, అనవసర రాజకీయం చేస్తే ప్రజలు హర్షించరని హెచ్చరించారు. చిన్న ఘటనను రాద్దాంతం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఘర్షణలు లేపి లబ్ధిపొందటమే లక్ష్యంగా బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని, వాటిని తెదేపా తప్పికొడుతుందని, రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం లేకుండా, ప్రత్యేక ¬దా పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. బీజేపీపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారని, అనవసర వ్యాఖ్యలు చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని సోమువీర్రాజు వ్యాఖ్యలపై గంటా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.