చంద్రులు కలసి పనిచేసే అవకశాలు ఉన్నాయా?
అలనాటి మహాకూటమి లాంటి పొత్తు సాధ్యమేనా?
హైదరాబాద్,అక్టోబర్12(జనంసాక్షి): అభివృద్ది కోసం ఇద్దరు చంద్రులు కలసి పనిచేయాలని, విభేదాలు విడనాడి తెలుగు రాష్టాల్రను ముందుకు తీసుకుని వెళ్లడంలో ముందుండాలని ఆ మధ్య ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదేపదే చెప్పిన తీరు చూస్తుంటే ఇద్దరి మధ్య సయోధ్యకు బాటలు వేశారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పుడు ఓటుకునోటు వ్యవహారాలు పెద్దగా కనిపించడం లేదు. తెలంగాణ టిడిపి నేతలు కూడా పెద్దగా రాజకీయ విమర్శలు చేయడం లేదు. కేవలం ఒకేఒక్కడు అన్న రీతిలో పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రమే నేరుగా సిఎం కెసిఆర్‌పై విరుచుకు పడుతున్నారు.
తెలంగాణలో పార్టీ మనుగడ కొనసాగించాలంటే టీఆర్‌ఎస్‌తో పొత్తు అనివార్యమని తెలంగాణ టీడీపీలో ఓ వర్గం గట్టిగా కోరుతోందన్న ప్రచారం కూడా ఇప్పుడు సాగుతోంది. తెలంగాణలో ఎలాగూ అధికారంలోకి రావడం కల్ల కనుక బాబు కూడా కెసిఆర్‌తో సయోధ్య కోరకుంటున్నారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల ఎన్టీర్‌ను ప్రస్తుత సిఎం కెసిఆర్ బాగా పొగడుతున్నారు. కోదండరామ్‌ను విమర్శించే క్రమంలో ఆనాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టారంటే ఆయనకున్న ఛరిష్మా కారణం అన్నారు. కోదండరామ్ సర్పంచ్‌గా గెలవలేరని అన్నారు. అలాగే ఎన్టీఆర్ మండల వ్యవస్థతో పాలనను ప్రజల వద్దకు తీసుకుని వెళ్లారని, అలాగే జిల్లాల ఏర్పాటుతో తాను కూడా అలగే పాలనా వికేంద్రీకరణచేశానని కెసిఆర్ చెబుతూ వచ్చారు. ఇవన్నీ సాధారణంగా జరగుతున్న వ్యవహారాల లేక ఓ పద్దపతి ప్రకారం చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. కాంగ్రెస్‌ను దూరంగా పెట్టే క్రమంలో టిడిపి,టిఆర్‌ఎస్‌లు కలసి పనిచేస్తాయా అన్నది ఊహాజనితమే అయినా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అన్నది గతానుభవాలు చెబుతున్నాయి. విభజనకు ముందు టిడిపితో కలసి టిఆర్‌ఎస్ మహాకూటమి కట్టిన అనుభవాలు మనముందున్నాయి.
అయితే టీఆర్‌ఎస్‌తో పొత్తు వ్యవహారం తెలంగాణ టీడీపీలో సంక్షోభానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయని పార్టీలో వాదించే వారూ ఉన్నారు. పొత్తు విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు పార్టీలోని ఓ వర్గానికి మింగుడుపడటం లేదు. పొత్తు ఉంటుందన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇతర నేతలు పార్టీని వీడి వెళ్లే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వ్యరతిరేకిస్తున్నది కూడా రేవంత్ మాత్రమే అన్న ప్రచారం ఉంది. పొత్తు అనివార్యమన్న సంకేతాలు కొనసాగితే వీలైనంత త్వరగా భవిష్యత్ ప్రణాళిక నిర్ణయించుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతల సమావేశం మరుసటి రోజే రేవంత్‌రెడ్డి.. పొత్తును వ్యతిరేకిస్తున్న ఇతర నేతలతో సమావేశమైనట్లు తెలిసింది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పొత్తు ఉందన్న అనుమానాలు నిజమయ్యే అవకాశం ఉందని, అదే జరిగితే ముందే భవిష్యత్ నిర్ణయించుకోవడం మంచిదని సీనియర్ నేత ఒకరు ఈ భేటీలో పేర్కొన్నట్టు తెలిసింది. చంద్రబాబుతో మరోసారి సమావేశమయ్యాకే నిర్ణయం తీసుకుందామని వీరి అభిప్రాయంగా ఉంది. ఇకపోతే కమ్మ,కాపులు, వెలమలు ఒక్కటవుతారనే ప్రచారం జరుగుతోంది. రేవంత్‌కు కాంగ్రెస్‌లో చేరే ఆలోచన ఉందని, అయితే ఇప్పుడే ఈ విషయంలో ఓ నిర్ణయానికి రావడం మంచిది కాదని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం.
పార్టీని నమ్ముకుని ఉన్నవారికి ఏవో కొన్ని సీట్లు కేటాయిస్తే పార్టీ మనుగడకు ఇబ్బంది ఉండదని, ఖమ్మం జిల్లాలాంటి చోట్ల పార్టీకి ఉన్న బలమైన పునాదులను కాపాడుకోవచ్చని ఆ వర్గం నేతలు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. చంద్రబాబు సలహాలు, సూచనల మేరకే ఓ వర్గం నుంచి
ఇలాంటి ప్రతిపాదనలు వస్తున్నాయని, అందువల్ల పొత్తు విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని రేవంత్ వర్గం చెబుతోంది. పొత్తులో భాగంగా ఖమ్మం లోక్‌సభ సీటుతోపాటు 15 అసెంబ్లీ సీట్లు కేటాయించేందుకు సుముఖంగా ఉన్నట్లు టీఆర్‌ఎస్ నాయకత్వం నుంచి టీడీపీకి సంకేతాలు అందినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ముఖ్య నేతలు ఉన్న నియోజకవర్గాల్లో వారికి సీట్లు కేటాయించవచ్చని టీడీపీ నాయకత్వం, తద్వారా మరోసారి తాము క్రియాశీలకం అవుతామని టికెట్ ఆశిస్తున్న నేతలు భావిస్తున్నారు. ఈ కారణంగానే సీనియర్ నేతలు ఎల్.రమణ, మోత్కుపల్లితోపాటు పలువురు నేతలు పొత్తు ప్రతిపాదనను సమర్థిస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. మొత్తంగా ఇప్పుడు ఎన్‌ఇనకలకు చాలా దూరం ఉన్నందున ఇవన్నీ కూడా కేవలం చర్చలో మాత్రమే ఉన్నాయని భావించాలి.