చిత్రావతిలో అక్రమ ఇసుక తవ్వకాలు
అనంతపురం,డిసెంబర్2(జనంసాక్షి):ఇసుక అక్రమ రవాణాతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లన్నీ ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వందలాది బోర్లు ఎండి పోవడంతో వాటి కింద సాగవుతున్న పంటలు ఎండి పోతున్నాయని, అయినా అధికారులు అక్రమ ఇసుక రవాణాపై స్పందించడం లేదన్నారు. అక్రమ ఇసుక రవాణా ఇలాగే కొనసాగితే చిత్రావతిలో దాదాపు 20 బోర్లు ఉన్నాయని అవికాస్త ఎండిపోయే ప్రమాదముందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీని వలన 20 గ్రామాలకు మంచి నీటి సరఫరా కూడా స్తంభించిపోతుందని పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని వారు కోరారు. ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రైతులు ఆయా మండలాల తహశీల్దార్లకు వినతిపత్రం అందజేస్తున్నారు. బోరుబావుల కింద ఉన్న ఇసుకను కొందరు అక్రమంగా తరలిస్తున్నారని చెప్పారు. ఇసుక రీచ్ లేకపోయినప్పటికీ ట్రాక్టర్లు పెద్ద సంఖ్యలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని చెప్పారు. వారిని అడ్డుకునే వారు కరువయ్యారని వాపోయారు.