చెరకు బకాయిలను త్వరలో చెల్లిస్తాం
విశాఖపట్టణం,సెప్టెంబర్8(జనంసాక్షి): తుమ్మపాల కర్మాగారానికి చెరకు సరఫరా చేసిన రైతుల బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు. రూ.1.98 కోట్లు బకాయిలు ఉన్నాయని, వాటిని త్వరలోనే చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలోని ఐదు సహకార కర్మాగారాలు రైతులకు బకాయిలు ఉన్నాయని అన్నారు. వీటన్నింటిపైనా ఈనెల 9వతేదీన నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. రైతులకు తమ ప్రబుత్వం న్యాయం చేస్తోందని అన్నారు. ఇదిలావుంటే
జలసిరి కార్యక్రమంతో ప్రజలు మమేకం కావాలని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరూ జలసంరక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు. అన్నీ ప్రభుత్వమే చేయదని, ప్రజల భాగస్వామ్యం కూడా తప్పనిసరని అన్నారు. తుమ్మపాల, గొడారి ఆనకట్టల ద్వారా ఏడాదిలో కనీసం 175 రోజులు సాగునీరు అందివ్వాలన్నది ప్రభుత్వం లక్ష్యమన్నారు. అందుకు అనుగుణంగా ఆనుసంధానం చేస్తారన్నారు. శారదానదిలో నీరు సముద్రంపాలు కాకుండా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన ప్రతిపాదనలు మూడు నెలల్లో తయారు చేయాల్సిందిగా జలవనరులశాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు. సుజలస్రవంతి తొలిదశలోనే ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఇందుకు అవసరమైన నిధులను అదనంగా మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హావిూ ఇచ్చారని అన్నారు. శారదానదిపై నిర్మించే తుమ్మపాల, గొడారి ఆనకట్లను సుజలస్రవంతితో అనుసంధానం చేస్తారని తెలిపారు. సుజలస్రవంతి వలన కశింకోట మండలంలో పది గ్రామాలకు సాగునీరు అందిస్తామన్నారు. రెండు ఆనకట్టలు పూర్తయితే అనకాపల్లి మండలంలో 30వేల ఎకరాలకు సాగునీరు అభిస్తుందని తెలిపారు.