చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండ
చేనేత కార్మికులకు చేతినిండా పని
జెడ్పి చైర్ పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి
సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , ఆగస్ట్ 7 ::చేనేత కార్మికులకు తెలంగాణా ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉందని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేనేత కార్మికులకు చేతినిండా పనిని ఏర్పాటు చేసిందని
జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అన్నారు.జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి ఐటిఐ కళాశాల నుండి కలెక్టరేట్ వరకు హ్యాండ్లూమ్ వాక్ నిర్వహించారు. ఇట్టి హ్యాండ్లూమ్ వాక్ ను జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంజు శ్రీ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేత కార్మికుల వెతలు తీరాయన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు పింఛన్లు అందజేస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. చితికిపోయిన వారి కుటుంబాల్లో వెలుగులు నింపారని, నేతన్నకు చేతినిండా పని కల్పించారని పేర్కొన్నారు. బతుకమ్మ పండగ కానుకగా అందజేస్తున్న చీరల తయారీతో చేనేత కార్మికులకు చేతినిండా పనితో ఉపాధి లభించిందన్నారు.ప్రస్తుత రోజుల్లో చేనేత ప్రతి ఒక్కరి ట్రెండ్ గా మారిందని, చేనేత దుస్తులకు భారీ డిమాండ్ ఉందని ఆమె అన్నారు.చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుందన్నారు. నేతన్నకు చేయూత, చేనేత మిత్ర, నేతన్న భీమా పథకం, మార్కెటింగ్ ఇన్సెంటివ్ పథకం లను అమలుచేసి వారి సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని అవకాశాలను చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత జౌళి శాఖ ఏడి విజయలక్ష్మి, చేనేత సహకార సంఘాల జిల్లా అధ్యక్షులు అశోక్, వివిధ చేనేత సహకార సంఘాల సభ్యులు, కార్మికులు, సంబంధిత శాఖ ఉద్యోగ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.