చేసేది అటెంటర్ ఉద్యోగం – కూడబెట్టిన ఆస్తులు రూ.80కోట్లు పైనే!
– ఏసీబీ అధికారుల దాడుల్లో విస్తుపోయే నిజాలు
నెల్లూరు, మే1(జనం సాక్షి): అతను చేస్తోంది మాములు అటెండర్ ఉద్యోగం.. అయితే అతని ఆస్తుల లెక్క చూస్తే మాత్రం ఎవరైనా షాక్‌కు గురికావాల్సిందే. ఎందుకంటే.. ఒకటి కాదు రెండు కాదు.. రూ.80 కోట్లకుపైగా విలువైన ఆస్తులను అక్రమ మార్గంలో కూడబెట్టాడు. అతని అక్రమ ఆస్తుల చిట్టాను తాజాగా అవినీతి నిరోధక శాఖ బయటపెట్టింది.
నెల్లూరు జిల్లా రవాణా శాఖ ఉద్యోగి నరసింహారెడ్డి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఆయన ఇంటితో పాటు కార్యాలయం, పట్టణంలోని బంధు, మిత్రుల ఇండ్లలోనూ సోదాలు చేశారు. ఈదాడుల్లో భారీ మొత్తంలో ఆస్తులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నరసింహారెడ్డి ఉప రవాణా శాఖ కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్నాడు. అనిశా అధికారులు స్వాధీనం చేసుకున్న వివరాల ప్రకారం.. రూ.80కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నట్లు తేలింది. 50 ఎకరాల భూమికి సంబంధించిన దస్త్రాలు, 18 ఫ్లాట్లు, రెండు కిలోల బంగారం, 7.5లక్షల నగదును గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు నగరంలో 222 చదరపు గజాల నివాస స్థలం, గుడిపాళెం గ్రామంలో 3.950 ఎకరాల వ్యవసాయ భూమి పత్రాలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నరసింహారెడ్డి భార్య పేరుతో నెల్లూరులోని పలు చోట్ల 1300కుపైగా చదరపు గజాల్లో నివాస స్థలాలు, నెల్లూరు ఎం.వి. అగ్రహారంలో జీఫ్లస్ టు భవనం, 47ఎకరాల వ్యవసాయ భూమి పత్రాలు స్వాదీనం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా ప్రమోషన్లు వచ్చినా నరసింహారెడ్డి వెళ్లకుండా.. నెల్లూరు రవాణా శాఖ కార్యాలయంలోనే అటెండర్‌గా పని చేస్తుండటం గమనార్హం. విజయవాడ అనిశా డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిగాయి. అయితే ఇందులో బినామి ఆస్తులు కూడా ఉండి ఉండవచ్చని అధికారులు బావిస్తున్నారు. ఇంకా రెండు లాకర్లు తెరవాల్సి ఉంది.
——————————————-