జగన్‌ అవినీతి ప్రపంచానికి తెలిసింది: యనమల

అమరావతి,నవంబర్‌7(జ‌నంసాక్షి): జగన్‌ ఆర్థిక నేరాలు తెలుగు ప్రజలకు బాగా తెలిసిందేనని.. ప్యారడైజ్‌ పత్రాల ద్వారా ఇప్పుడు ప్రపంచానికి తెలిసిందని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. 714 మంది భారతీయ ఆర్థిక నేరగాళ్లలో జగన్‌ ప్రత్యేక స్థానం పొందారని ఎద్దేవా చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే జగన్‌ పాదయాత్ర చేపట్టారని ఆరోపించారు. ఒక ఆర్థిక నేరస్థుడు, పన్ను ఎగవేతదారుడు పాదయాత్ర చేసినట్లు చరిత్రలో లేదన్నారు. పాదయాత్ర మధ్యలో కోర్టు వాయిదాలకు హాజరైన చరిత్ర గతంలో ఎవరికీ లేదన్నారు. అసెంబ్లీలో విపక్షనేతగా ఉన్న జగన్‌ సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయించుకుని పాదయాత్ర చేయడమే విడ్డూరమని అన్నారు. అందరూ అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని కోరుకుంటే జగన్‌ మాత్రం వద్దని కోరకుంటున్నారని అన్నారు. ప్యారడైజ్‌ పేపర్‌లో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ అవినీతి మరోసారి బయటపడిందని మంత్రి యనమల ఈ సందర్భంగా అన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే జగన్‌ పాదయాత్ర చేస్తున్నారన్నారు. జగన్‌ ఆఫ్‌ షోర్‌ లావాదేవీలపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరారు. వైఎస్‌ పాలనలో 7లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఎందుకు తగ్గిందో జగన్‌ సమాధానం చెప్పాలని యనమల డిమాండ్‌ చేశారు. రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడే ముందు వైఎస్‌ పాలనలో పెరిగిన రెట్టింపు అప్పుల గురించి సమాధానం చెప్పాలన్నారు. ఆర్థిక నేరస్థుడిగా ముద్ర పడిన జగన్‌ నోటి వెంట ప్రత్యేక ¬దా మాట రావడం ఎబ్బెట్టుగా ఉందన్నారు. రాష్ట్ర విడిపోయాక తెదేపా ప్రభుత్వం వరుసగా మూడేళ్లు రెండంకెల వృద్ధి ఎలా సాధించిందో జగన్‌ పాదయాత్రలో చెప్పాలని సూచించారు.

తాజావార్తలు