జగన్ చాంబర్‌లోకి వర్షపు నీరు – పరిశీలించిన సీఆర్డీఏ అధికారులు
అమరావతి, మే2( జనం సాక్షి) : ఏపీ అసెంబ్లీలోని విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చాంబర్‌లో సీఆర్డీఏ అధికారులు బుధవారం తనిఖీలు జరిపారు. మంగళవారం అమరావతి పరిసరాల్లో భారీగా వర్షం కురిసింది. దీంతో జగన్ చాంబర్‌లోకి వర్షపు నీరు చేరింది. ఈ సమాచారం తెలుసుకున్న సీఆర్డీఏ అధికారులు
హుటాహుటిన జగన్ చాంబర్‌కు చేరుకుని పరిశీలన జరిపారు. వర్షపు నీరు ఎక్కడినుంచి వచ్చిందన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. నీళ్లు రావడంపై అసెంబ్లీ సిబ్బందిని, పారిశుద్ధ్య కార్మికులను ప్రశ్నించారు. ఛాంబర్‌లోకి నీళ్లు ఎలా వచ్చాయంటూ ఫైర్ ఇంజిన్‌తో తనిఖీలు జరిపిన అధికారులు.. లీకేవీ వల్లే వచ్చాయని నిర్ధారణకు వచ్చారు. నిన్నటి వర్షంతో చాంబర్‌లో సీలింగ్ నుంచి వర్షపు నీరు ధారగా కారడంతో.. ఈ అంశంపై శాసనసభ ఇన్‌చార్జి కార్యదర్శి ఎం.విజయరాజుకు వైఎస్సార్ సీఎల్పీ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఇన్‌చార్జి కార్యదర్శి ఆదేశాల మేరకు శాసనసభ సిబ్బంది వర్షపు నీటిని ఎత్తిపోశారు. గతేడాది జూన్‌లో కురిసిన వర్షానికి ఇదే రీతిలో ప్రతిపక్ష నేత చాంబర్‌లో వర్షపు నీరు చేరింది. తాజాగా కురిసిన వర్షం కారణంగా ప్రతిపక్ష నేత చాంబర్‌లోనే మళ్లీ లీకేజీలు బయటపడటం గమనార్హం. తాజాగా వర్షపు నీరు చేరడం, సీఆర్డీఏ అధికారులు పరిశీలన చేయడం జరిగింది. కాగా… ఇదే విషయంపై ప్రతిపక్ష వైసీపీ నేతలు ప్రభుత్వ పాలనా యంత్రాంగంపై పలు విమర్శలు కూడా చేశారు.