జగన్‌ పాదయతాత్రతో భయమెందుకు: వైకాపా

విజయనగరం,నవంబర్‌16(జ‌నంసాక్షి): వైకాపా అధినేత జగన్‌ పాదయాత్రతో అధికార టిడిపిలో వణుకు పుడుతోందని, గతంలో వైఎస్‌ చేపట్టిన తరహాలోనే పాదయాత్ర సాగుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. దీనిని తట్టుకోలేక అధికార పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా విమర్వలు చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో తమ పార్టీ వారిని టిడిపిలో చేర్చుకున్న తీరుకు నిరసనగానే అసెంబ్లీని బహిష్కరించామని గురువారం నాడిక్కడ అన్నారు. టీడీపీ నాయకులకు దమ్ముంటే నాలుగేళ్ల

పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు గడిచినా తోటపల్లి జలాశయం నుంచి రైతులకు పూర్తిగా సాగునీరిచ్చిన దాఖలాలు లేవన్నారు. మరో ప్రాజెక్ట్‌ తారకరామతీర్థసాగర్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. 2004 నుంచి 2014 వరకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి, నాటి మంత్రి బొత్స సత్యనారాయణల హయాంలో జిల్లా అభివృద్ధి చెందింది తప్ప టీడీపీ హయాంలో కాదని చెప్పారు. కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు మంత్రులుగా జిల్లాకు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఎంతసేపూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మినహా, ప్రజలకు వారు చేసిందేవిూ లేదని ఎద్దేవా చేశారు. అంగన్‌వాడీ, ఎలక్ట్రికల్‌ షిఫ్ట్‌ ఆపరేటర్ల ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర టీడీపీ నాయకులకు ఉందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రనేపథ్యంలో టీడీపీ నాయకుల గుండెల్లో గుబులు పట్టుకుందని అన్నారు. అశోక్‌, సుజయ్‌కృష్ణ ఉన్నత సామాజిక వర్గం నుంచి వచ్చిన వారు కనుక వారికి పేద ప్రజల సమస్యలు పట్టవన్నారు. ఇప్పటికైనా వారు చౌకబారు రాజకీయాలు మాని జిల్లా అభివృద్ధి కోసం పనిచేయాలని హితవు పలికారు.

తాజావార్తలు