జగన్ కు మాట్లాడే హక్కు లేదు
రాష్ట్రప్రత్యేక హోదాకోసం రాష్ట్ర విభజనకోసం ఆనాడు ఎంపిగా ఉండి పార్లమెంట్‌లో నోరుమెదపని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేకహోదా గురించి మాట్లాడే అర్హత లేదని , దమ్ము, ధైర్యం ఉంటే ఢిల్లీ పెద్దల ఎదుట పోరాడాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు)లు జగన్‌కు సవాల్ విసిరారు. సోమవారం వారిరువురూ జిల్లాలో గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, వేంపల్లె, కడపలో పర్యటించి ఆ సందర్భంగా వారు విలేఖర్లతో మాట్లాడుతూ సిబిఐ కేసుల్లో లక్షకోట్లరూపాయలు దిగమింగిందేవరో ప్రజలందరికీ తెలుసునని తమపార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మచ్చలేని మనిషి అన్నారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బాబుపై తప్పుడు కేసులు బనాయించి అనేక దర్యాప్తులు చేసినా క్లీన్ చిట్ వచ్చిందని, ఈనాడు జగన్ చేస్తున్న ఆరోపణలు చూస్తే జైలుకు ఎవరు వెళ్లేది కాలమే నిర్ణయిస్తుందని, మతిభ్రమించి అర్థంపర్ధం లేకుండా తమ నేత బాబుపై విమర్శలు చేస్తే ఊరుకుండే ప్రసక్తేలేదని వారు ఘాటుగా హెచ్చరించారు. రాష్ట్ర విభజన అనంతరం రూ.16వేల కోట్లు రాష్టల్రోటు బడ్జెట్ ఉందని తెలిసి అప్పుల్లో నెంబర్ వన్ బాబు అని ప్రకటించడం జగన్ అవివేకమని దుయ్యబట్టారు. తమ అధినేత చంద్రబాబు జగన్ లాంటి నల్లకుబేరులను శిక్షించేందుకే డిమాండ్ చేస్తున్నారని, దమ్ము, ధైర్యం ఉంటే తన ఆస్తిపాస్తులను వెల్లడించాలని ఇప్పటికే తమనాయకుడు తమ కుటుంబ ఆస్తిపాస్తులను ప్రకటించారని వారు గుర్తు చేశారు.