జలసంరక్షణ బాధ్యత కావాలి: మంత్రి
గుంటూరు,సెప్టెంబర్8(జనంసాక్షి): ప్రతి ఒక్కరూ జలసంరక్షణను బాధ్యతగా తీసుకొని అందుకు కృషి చేయాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. జలసంరోణ అన్నది మన బాధ్యతగా గుర్తించాలన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం-గోవిందపురం గ్రామాల మధ్య ఏడుమంగళంవాగు వద్ద ఏర్పాటు చేసిన జలసిరికి హారతి కార్యక్రమంలో మరో మంత్రి నక్కా ఆనంద్‌బాబుతో కలిసి శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ముందుగా వేదమంత్రాల మధ్య వాగులో జలసిరికి మంత్రులు హారతి ఇచ్చారు. అనంతరం మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ.. నీటిలభ్యత, ప్రాధాన్యత, పొదుపులపై అందరూ అవగాహన పెంచుకోవాలని కోరారు. పట్టిసీమ ద్వారా 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందన్నారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. నదులు అనుసంధానం చేసి డెల్టాకు జూన్ నెలలో సాగునీరు అందించిన అపర భగీరథుడు చంద్రబాబునాయుడు అంటూ కొనియాడారు. అనంతరం మంత్రులిద్దరూ భావితరాల కోసం జలసంరక్షణ చేస్తూ కరవు రహిత రాష్ట్ర నిర్మాణం కోసం పాటుపడతామంటూ అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, జడ్పీ ఛైర్‌పర్సన్ జానీమూన్, జలవనరులశాఖ ఎస్పీ చౌదరి తదితరులు పాల్గొన్నారు.