జిల్లాలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి
గుంటూరు: డిసెంబర్ నెలాఖరు నాటికి జిల్లావ్యాప్తంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాలని కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. భోపాల్‌లో జాతీయస్థాయిలో జరిగిన స్వచ్ఛభారత్ సదస్సుకు ఏపీ నుంచి కలెక్టర్ కాంతిలాల్ దండే హాజరయ్యారు. ఈ సదస్సులో చర్చించిన అంశాలు, స్వచ్ఛభారత్ ప్రాధాన్యం, తదితర అంశాలపై సోమవారం కలెక్టర్ కాంతిలాల్ దండే జడ్పీలో జరిగిన కార్యక్రమంలో అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో జిల్లా జాతీయ స్థాయిలో ముందుండాలన్నారు. ఇందుకు జిల్లాలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు కృషి చేయాలన్నారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందిని కూడా భాగస్వాములను చేయాలని సూచించారు. 2016 ఆగస్టులో జరిగే కృష్ణా పుష్కరాల కంటే ముందే జిల్లాలో ప్రతి కార్యాలయంలో, ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో ప్రజల్లో అవగాహన పెంచడానికి అన్నిరకాల కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ నెల 30 ఆదివారం జిల్లా స్థాయిలో మరు గుదొడ్ల ప్రాధాన్యం, నిర్మాణాలు, ప్రభుత్వ నిధులు, లబ్ధిదారులను భాగస్వాములను చేయడం తదితర అంశాలపై శిక్షణ జరుగుతుందన్నారు. శిక్షణ పొందనవారు మండల, గ్రామ స్థాయిలో శిక్షణ ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో కొసనాగ నాగబాబు, జడ్పీ సీఈవో సుబ్బారావు, హౌసింగ్ పీడీ సురేష్‌కుమార్, డీఎస్‌వో చిట్టిబాబులతో కలెక్టర్ చర్చించారు.