జోరుగా జలసిరికి హారతి

ఏలూరు,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): జిల్లాలో జలహారతి కార్యక్రమాలను జోరుగా చేపట్టారు. సాగునీటి వనరులను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులను వెచ్చించి కృషి చేస్తుందని పోలవరం శాసనసభ్యుడు, ఎస్టీ శాసనసభా కమిటీ ఛైర్మన్‌ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని పోగొండ, జల్లేరు జలాశయాల వద్ద శుక్రవారం జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలను చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 29 జలాశయాల నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్‌ పి.రామారావు, తెదేపా మండల అధ్యక్షుడు ఎం.సోంబాబు, సొసైటీ అధ్యక్షుడు కె.రామచంద్రరావు, విశ్రాంత ప్రత్యేక ఉపకలెక్టర్‌ పి.గవరయ్య తదితరులు పాల్గొన్నారు. మరోవైపు పోలవరం కుడికాలువకు ప్రభుత్వ విప్‌ చిన్నమనేని ప్రభాకర్‌ జలసిరి హారతి నిర్వహించారు. పెదవేగిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రభాకర్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పూలు, పసుపు కుంకుమ చల్లిన అనంతరం హారతి ఇచ్చారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ సంజీవరావు, ఎంపీపీ బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు