జ్ఞానమార్గాన్ని బలోపేతం చేసిన యతి
భగవద్రామానుజాచార్యులు
తిరుమల,ఏప్రిల్20(జనంసాక్షి): భగవద్రామానుజాచార్య ఈ జ్ఞాన మార్గాన్ని బలోపేతం చేసి, అది అక్కడికే ఆగిపోకుండా ఆచరణగా వచ్చేట్టు తీర్చిదిద్ది ఒక పరంపరలో వచ్చేట్టు చేసారు. రామానుజాచార్య స్వామి నిరంతర సాధకులు,అందుకే యతి అంటాం. యతే కాదు యతులనే నియమించగల వారు కనుక వారిని యతిపతి, యతీశ్వర, యతిరాజ అని అంటాం. మనం అట్లాంటి వారి మార్గనిర్దేశంలో ఉంటే చాలు తరిస్తాం. తిరుమల కొండవిూది వ్యవస్థను 11 వ శతాబ్దంలో రామానుజులవారు క్రమబద్ధం చేసినప్పుడు అక్కడ ఒక జీయరును ఏర్పాటు చేసి, ఆ జీయరు స్వామితో నలుగురు ఏకాంగులని పెట్టి, ఆ జీయరు స్వామికి కొన్ని గుర్తులు ఇచ్చారు. హే జీయరు స్వామిన్! విూరు ఈ వేంకటేశ్వర స్వామికి సేవలు ఎట్లా చేయాలంటే రామ సేవ కోసం హనుమ ఎట్లా అయితే స్పందించాడో అట్లా చేయాలి. రామ సేవ కోసం హనుమ లంకకి వెళ్ళమంటే ఒంటరిగా వెళ్ళగలిగాడు. రావణ సభలో ఆతడి సైన్యం ముందర నిలబడి తోకకు చుట్టి నిన్ను రాముడి పాదాల వద్ద వేయగలను జాగ్రత్త అని చెప్పేంత సాహసంతో వెళ్ళాడు. దేవుడి సేవలో ఎట్లాంటి అపచారాలు జరగటానికి వీలు లేదు. అందుకే హనుమంతుడి జెండా, హనుమంతుడి ముద్రిక, హనుమంతుడి తాళం చెవి, హనుమంతుడి ఉంగరాన్ని ఇవన్నీ వారికి ఏర్పాటు చేయించి ఇచ్చారు. రామానుజులవారు ఇవన్నింటినీ హనుమంతుని సంబంధంతో ఏర్పాటు చేయించి ఇచ్చారు. హనుమంతుని సన్నిధికి ప్రక్కనే వారి మఠాన్ని కట్టించి, రాముని వద్ద హనుమ ఎట్లా అయితే ఉన్నాడో ఈ వేంకటేశుడి వద్ద విూరూ అట్లా ఉండాలి అని జీయర్ స్వామికి తామారాదిచుకొనే రామచంద్రుణ్ణి జీయరుస్వామికి ఇచ్చారు.