విజయవాడ: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ సోమవారం ఉదయం కన్నుమూశారు. కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సోమవారం ఉదయం 5 గంటల సమయంతో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన అసలు పేరు దేవినేని రాజశేఖర్. నెహ్రూ ఒక అబ్బాయి… ఒక అమ్మాయి ఉన్నారు. మరణవార్త తెలుసుకున్న నెహ్రూ కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. నెహ్రూ ఆకస్మిక మృతితో ఆయన అనుచరులు, అభిమానులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు.విజయవాడ రాజకీయాల్లో నెహ్రూ కీలక పాత్ర పోషిస్తున్న నెహ్రూ కంకిపాడు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఒకసారి.. మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయ జీవితం ప్రారంభించిన నెహ్రూ ఎన్టీఆర్ హయాంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. తెదేపా చీలిక సమయంలో ఎన్టీఆర్‌కు అండగా నిలబడ్డారు. తదనంతరం పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. 2009, 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తర్వాత తెదేపాకు దగ్గరవుతూ ఇటీవలే చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు.\
ప్రముఖుల సంతాపం
దేవినేని నెహ్రూ మృతిపట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు సంతాపం ప్రకటించారు. నెహ్రూ ఆకస్మిక మృతి తనకు, పార్టీకి తీరని లోటని చంద్రబాబు అన్నారు.