టీ కాస్తుండగా చెలరేగిన మంటలు

ప్రయాణికుల వెల్లడి
రాజమండ్రి,మే11(జ‌నం సాక్షి ): పాపికొండలు యాత్రకు వెళ్లిన ఓ పడవలో మంటలు చెలరేగాయి. తూర్పగోదావరి జిల్లా దేవీపట్నం మండలం వీరవరపులంక వద్ద శుక్రవారం ఉదయం పడవలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. పోశమ్మగుడి నుంచి బయల్దేరిన 10 నిమిషాలకే ఈ ఘటన చోటుచేసుకుంది.
పడవ బయలుదేరిన కాసేపటికే గ్యాస్‌ పొయ్యిపై టీ కాస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఈ మంటలు పక్కనే ఉన్న జనరేటర్‌కు వ్యాపించాయి. మంటలు చెలరేగడంలో బోటు డ్రైవర్‌ పడవను ఒక్కసారిగా వీరవరపులంక ఇసుక తిన్నెల వైపు మళ్లించాడు. వెంటనే పలువురు ప్రయాణికులు ఇసుకతిన్నెలపైకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. చిన్నారులు, వృద్ధులను బోటులోని యువకులు కాపాడారు. అక్కడే ఉన్న పలువురు స్థానికులు కూడా పడవ వద్దకు చేరుకొని పలువురిని రక్షించారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో పడవలో 120 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పడవలో మంటలు చెలరేగడంలో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఘటన గురించి తెలుసుకున్న వీరవరపులంక వాసులు పలువురు ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. సమాచారమందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్నారు. స్థానికుల సాయంతో మిగతావారిని కూడా రక్షించారు. మంటల ధాటికి పడవ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం ప్రయాణికులను అక్కడి నుంచి తరలించి వైద్య సేవలు అందించారు.

తాజావార్తలు