ఠారెత్తిస్తున్న ఎండలు
బయటకు రావాలంటేనే భయపడుతున్న జనాలు
చిత్తూరు,ఏప్రిల్24(జనంసాక్షి):జిల్లాలో సూరీడు నిప్పులుగక్కుతుండడంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, వడగాలులతో ప్రజలు హడలిపోతున్నారు. ఉదయం 9 గంటలకే బయటికి రావాలంటే రాలేని పరిస్థితి. మధ్యాహ్న ఉష్ణోగ్రతలకు వడగాలులు తోడవుతుండడంతో మనుషులు వడలిపోతున్నారు. ఏప్రిల్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే.. రానున్న మే నెలలో ఎండలు మరెంతగా మండుతాయోనని జనం ఆందోళన చెందుతున్నారు. వేసవిలో ఏటా వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులకు జిల్లా వ్యాప్తంగా మరణాలు సంభవిస్తున్నాయి. జిల్లాలో సగం కంటే ఎక్కువ మండలాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతోంది. ప్రధానంగా చంద్రగిరి, తిరుపతి, సత్యవేడు, తంబళ్లపల్లె, చిత్తూరు, పూతలపట్టు, జీడీనెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో గడిచిన 10 రోజుల్లో 40-42.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాల్పులూ పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బపై గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని, విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా వైద్య శాఖ గ్రామాల్లో వడదెబ్బపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. మిగిలిన శాఖల నుంచి ఆ మేరకు స్పందన ఉండడం లేదు. ఎండల్లో ఉపశమన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సైతం నిధులను మంజూరు చేసింది. ప్రధాన కూడల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను విరివిగా అందుబాటులోకి తేవాలని స్పష్టం చేసింది. ఈ ఏడాది వడదెబ్బ మరణాలను తగ్గించేందుకు అధికార యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టి ప్రచారం చేస్తోంది. ఎండలో పనిచేసే వారు ఎండ వేడిమికి తట్టుకోలేకపోతున్నారు. వ్యవసాయ పొలాల్లో రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. మధ్యాహ్న సమయంలో పొలాల్లో ఉండలేని పరిస్థితి. క్షేత్రస్థాయిలో చలివేంద్రాల ఏర్పాటును ప్రభుత్వ శాఖలు పట్టించుకోవడం లేదు. పట్టణాల్లో స్వచ్ఛంద సంస్థలు, స్థానికంగా ఉన్న వారు పలుచోట్ల చవివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సగం కంటే ఎక్కువ మండల కేంద్రాల్లో చలివేంద్రాల ఏర్పాటు వూసే లేదు. ఉపాధి హావిూ పనులు చేసే కూలీల వద్ద నీరు, నీడ సౌకర్యాలు అంతంత మాత్రంగా ఏర్పాటు చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. భవన నిర్మాణాలు జరిగే ప్రాంతాల్లోనూ కూలీలకు అవగాహన కల్పించాల్సి ఉంది.