డిసెంబరు నాటికల్లా సింగరేణి లో నాలుగు కొత్త ప్రాజెక్టులు ప్రారంభం

వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త ప్రాజెక్టుల నుండి 200 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి
కొత్త ప్రాజెక్టుల కోసం 90 శాతం పనులు పూర్తి
నైనీ ఓసీ , వీకే కోల్ మైన్, రొంపేడు ఓసి, గోలేటి ఓపెన్ కాస్ట్ లపై
ఛైర్మన్, ఎండీ ఎన్. శ్రీధర్ సమీక్ష
సింగరేణి సంస్థ కొత్తగా చేపట్టనున్న నాలుగు ఓపెన్ కాస్ట్ గనులను డిసెంబరు నాటికల్లా ప్రారంభించాలని, వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టుల నుండి నిర్దేశిత 200 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలని సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.శ్రీధర్ దిశా నిర్దేశం చేశారు. హైదరాబాద్ సింగరేణి భవన్ లో గురువారం (3 వ తేదీన) ఆయన సింగరేణి సంస్థ చేపట్టనున్న కొత్త గనులపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన ఈ ఆర్థిక సంవత్సరం చివరలో ప్రారంభించాల్సి ఉన్న నైనీ బొగ్గు(ఒడిశా రాష్ట్రం), వీకే కోల్ మైన్ (కొత్తగూడెం ఏరియా), రొంపేడ్ ఓపెన్ కాస్ట్ (ఇల్లందు ఏరియా), గోలేటి ఓపెన్ కాస్ట్ (బెల్లంపల్లి ఏరియా) లకు సంబంధించిన అన్ని అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు.
ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు బ్లాక్ కు అన్ని అనుమతులు లభించిన నేపథ్యంలో అక్కడ నిర్మించాల్సిన సీహెచ్పీ, ప్రధాన రైలు మార్గం నుండి సీహెచ్పీ వరకు నిర్మించవలసి ఉన్న రైల్వేసైడింగ్, ఈ ఏడాది చివరి నుంచి ఉత్పత్తి అవుతున్న బొగ్గును రైల్వేసైడింగ్ వరకు రవాణా జరపటానికి సంబంధించిన కాంట్రాక్టు పని తదితర అంశాలపై చర్చించారు. త్వరలోనే తాను మరియు డైరెక్టర్లు ఒడిశా అధికారులను కలిసి ఇంకా మిగిలి ఉన్న ఆర్ అండ్ ఆర్ సమస్య, చెట్ల తొలగింపు అంశాలపై చర్చిస్తామని వివరించారు. ఈ పనులన్నీ డిసెంబర్ లోగా పూర్తవుతాయని, జనవరి నుండి ఉత్పత్తి ప్రారంభించాలని, వచ్చే ఏడాది పూర్తిస్థాయిలో గని కి నిర్దేశించిన 100 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
కొత్తగూడెంలో ప్రారంభించనున్న వీకే కోల్ మైన్, ఇల్లెందు ఏరియాలో ప్రారంభించాల్సి ఉన్న రొంపేడు ఓపెన్ కాస్టు గనులకు సంబంధించి ఇంకా రావాల్సి ఉన్న అటవీ అనువతులను అక్టోబర్ నాటికల్లా సాధించాల్సి ఉంటుందని, ఈ గనుల్లో కూడా డిసెంబర్ నుండి ఉత్పత్తి ప్రారంభించాలని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది వీకే కోల్ మైన్ నుండి 40 లక్షల టన్నుల బొగ్గు , రొంపేడు ఓపెన్ కాస్ట్ గని నుండి 20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
గోలేటి ఓపెన్ కాస్టు గనికి సంబంధించి ఇంకా ప్రభుత్వం నుండి రావాల్సి ఉన్న అటవీ అనుమతుల కోసం ఇప్పటినుండి గట్టి ప్రయత్నం చేయాలని ఈ గని నుండి కూడా వచ్చే జనవరి నెల నుండి ఉత్పత్తి ప్రారంభించాలని వచ్చే ఏడాది 35 లక్షల టన్నుల ఉత్పత్తి చేయాల్సి ఉంటుందన్నారు.
ఈ నాలుగు గనుల నుండి వచ్చే ఏడాది సాధించే 200 లక్షల టన్నుల అదనపుఉత్పత్తి వల్ల సింగరేణి ఉత్పత్తి లక్ష్యాలు అత్యుత్తమ స్థాయికి చేరుతాయన్నారు.
సంస్థ డైరెక్టర్లు ఏరియా జనరల్ మేనేజర్లు ఎప్పటికప్పుడు ఈ గనులకు సంబంధించిన ప్రభుత్వ పరమైన అనుమతులపై తమ పరిధిలో ఉన్న జిల్లా కలెక్టర్లతో సంప్రదిస్తూ వాటిని సత్వరమే పొందాలన్నారు. కొత్త గనులకు సంబంధించి ఓవర్ బర్డెన్ తొలగింపుకై ఇప్పటికే అవసరమైన కాంట్రాక్టు పనులను అప్పగించడం జరిగిందని, ఇంకా మిగిలి ఉన్న యంత్రాల సమకూర్పు తదితర అంశాలపై అనుమతులను వెంటనే ఇవ్వడం జరుగుతుందన్నారు. కొత్త గనులను అనుకున్న సమయానికి ప్రారంభించడం కోసం ఉన్నత స్థాయి అధికారులు మరియు ఏరియాలో జనరల్ మేనేజర్లు జట్టుగా పనిచేస్తూ మిగిలిన అన్ని అనుమతులు ముందస్తుగానే సమకూర్చుకోవాలని ఆదేశించారు.
అలాగే రానున్న ఐదు సంవత్సరాలలో ప్రారంభించాల్సి ఉన్న కొత్త గనులపై కూడా అంశాల వారీగా చర్చించారు. సమావేశంలో సంస్థ డైరెక్టర్లు ఎన్ .బలరామ్ (ఫైనాన్స్ మరియు పర్సనల్ ), ఎన్.వి.కె. శ్రీనివాస్ (ఆపరేషన్స్), జి.వెంకటేశ్వర్ రెడ్డి (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్), అడ్వైజర్ మైనింగ్ డి.ఎన్. ప్రసాద్, అడ్వైజర్ ఫారెస్ట్రీ సురేంద్ర పాండే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ జె.ఆల్విన్, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎం.సురేష్, కార్పొరేట్ జనరల్ మేనేజర్లు జక్కం రమేష్ (సీపీపీ), జీఎం(పీపీ) సాయిబాబు, కార్పోరేట్ జీఎంలు, ఏరియా జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.
– (ప్రత్యేక ప్రతినిధి / జనం సాక్షి )

తాజావార్తలు